2014లో విభజిత రాష్ట్ర సుస్థిరత కోసం అప్పటి బీజేపీ, తెలుగుదేశం
కూటమికి జనసేన మద్దుతు తెలిపిందన్న పవన్, ఇప్పటికీ
జనసేన పార్టీ ఎన్టీయేలోనే కొనసాగుతోందని స్పష్టం చేశారు. 2014లో
రాష్ట్రం కోసం పనిచేసిన కూటమి 2024లోనూ పని చేయాలనేది తన ఆకాంక్ష అన్నారు.
కేంద్ర
పెద్దలను పలుమార్లు కలిసి ఇదే విషయాన్ని విన్నవించినట్లు తెలిపారు. జనసేన-బీజేపీ సమన్వయం
కమిటీ ఉందన్న పవన్, ప్రస్తుత రాజకీయ
పరిణామాల నేపథ్యంలో జనసేన-తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ ఉండాలని
నిర్ణయించామన్నారు.
జనసేన పార్టీ పొత్తుల గురించి వైసీపీ
నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేనాని పవన్ అన్నారు. ప్రత్యర్థుల పొత్తుల
గురించి ఆలోచించడం మాని రాష్ట్రాభివృద్ధి పై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
తెలంగాణ నేతల్లా కేంద్రంతో ఎందుకు రాష్ట్ర
సమస్యల గురించి మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు పసుపు బోర్డు కేటాయించినప్పుడు
మన రాష్ట్రానికి కొబ్బరి, జీడి బోర్డుల కోసం పట్టుబట్టలేకపోయారని దెప్పిపొడిచారు. వైసీపీ
ఎంపీలు టీలు, కాఫీలు తాగడానికి పార్లమెంటుకు
వెళ్తున్నారా..? లేక వారిపై ఉన్న కేసుల గురించి కేంద్ర పెద్దలతో
చర్చించడానికి వెళ్తున్నారా..? అని దుయ్యబట్టారు.
మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో
మీడియా సమావేశం నిర్వహించిన పవన్… “రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఐఏఎస్
అధికారులు 206 మంది, ఐపీఎస్ అధికారులు 130
మంది, ఐఎఫ్ఎస్ అధికారులు 50
మంది ఉన్నారు. వీరికి 20 రోజులకు కూడా వారి నెల వేతనం పడని పరిస్థితి
ఉంద’’న్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల వేదన
వర్ణనాతీతమన్న పవన్.. సకాలంలో జీతాలు అందక పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన
వ్యక్తం చేశారు. వైసీపీ నిర్వాకంతో ఢిల్లీ
వెళ్లి దేహీ అంటే తప్ప ప్రతి నెలా వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉత్పన్నమైందని
దుయ్యబట్టారు.
రాష్ట్ర పరిస్థితి మీద మాట్లాడిన
వారిపై దాడులు, గట్టిగా అడిగితే దేశద్రోహం కేసులు పెట్టడం తప్ప
ఈ ప్రభుత్వం చేసేదేమి లేదు. రాష్ట్ర సమస్యలపై
మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాధానం చెప్పేందుకు కూడా సీఎంకు తీరిక లేదా
అని ప్రశ్నించారు.