ఆలస్యమైనప్పటికీ
న్యాయం తప్పకుండా గెలుస్తుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
టీడీపీ అంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందన్నారు. తెలుగుదేశం కార్యకర్త విజిల్
వేసినా, కొవ్వత్తి పెట్టి నిరసన తెలిపినా కేసులు పెడుతోందని మండిపడ్డారు.
తనపై
పాలక పెద్దలు చేస్తున్న ఆరోపణలకు కోర్టులో చెబుతున్న సమాధానాలు వేరువేరుగా ఉన్నాయని
ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.
ప్రజల
కోసం నిరంతరం పనిచేసినందుకు మాజీ సీఎం చంద్రబాబును అధికారపార్టీ అక్రమ కేసులు
బనాయించి అరెస్టు చేసిందని నారా లోకేశ్
ఆరోపించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయనను జుడీషియల్ రిమాండ్ కు పంపారని
వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ కేసులు పెట్టి వ్యవస్థలను మేనేజ్
చేసి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన చెందారు. గతంలో స్కిల్ కేసులో
రూ. 3 వేల కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించిన సంస్థలు ఇప్పుడు రూ. 27
కోట్లు అని చెబుతున్నారన్నారు.
టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. 22 రోజుల తర్వాత
దిల్లీ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన లోకేశ్, కొద్దిసేపు టీడీపీ క్యాంప్ సైట్ లో
గడిపారు. తల్లి, భార్య ఇతర బంధువులతో మాట్లాడారు.
అనంతరం మూడు గంటల నుంచి 3.45
గంటల వరకు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.
తమ
అధినేతను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా రేపు ‘‘ కాంతితో క్రాంతి’’ కార్యక్రమంలో
ప్రజలంతా పాల్గొనాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
7వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.05
గంటల వరకు ఇళ్ళలో లైట్లు ఆపి, దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు
వెలిగించి, వాహనాల లైట్లు బ్లింక్ చేసి చంద్రబాబుకి సంఘీభావం ప్రకటించాలని లోకేశ్
కోరారు. ‘బాబుతో నేను’ అంటూ వీడియో తీసి షేర్ చేయాలన్నారు.
స్కిల్
కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన రాజమహేంద్రవరం
కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన రిమాండ్ 28వ
రోజుకు చేరుకుంది. అక్టోబర్ 19 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. బెయిల్,
కస్టడీ పిటిషన్లపై తీర్పును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది.