భారతదేశంలోని తమ దేశపు పలువురు దౌత్యవేత్తలను
కెనడా ఇతర ప్రాంతాలకు తరలించింది. వారిని కౌలాలంపూర్, సింగపూర్ తరలించినట్లు
సమాచారం. ఇరు దేశాల దౌత్యసంబంధాలూ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో కెనడా ఈ చర్య
తీసుకుంది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా
భారతదేశంపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేసింది. నాటినుంచీ ఇరుదేశాల మధ్యా దౌత్యసమరం
జరుగుతోంది. భారత రాయబార కార్యాలయంలోని సిబ్బందిని తమదేశం విడిచి వెళ్ళాలంటూ కెనడా
ఆదేశించింది. ఆ నిర్ణయంపై భారత్ మండిపడింది. అక్టోబర్ 10లోగా భారతదేశంలో ఉన్న తమ
దౌత్యసిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలంటూ కెనడాకు
భారత్ అల్టిమేటం జారీ చేసింది.
కెనడా, భారత్ దౌత్య కార్యాలయాల్లో
ఉద్యోగుల సంఖ్యను సమానంగా ఉంచేందుకు భారత్ నిర్ణయించింది. కెనడాలో ఉన్న భారతీయ
దౌత్య ఉద్యోగుల కంటె, భారత్‌లో కెనడా ఉద్యోగుల సంఖ్య 41 ఎక్కువగా ఉంది. అందుకే అక్టోబర్
10లోపు అంతమంది దౌత్య ఉద్యోగులను తగ్గించాలని భారత్ తీవ్రంగా హెచ్చరించింది.
జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం
ఖలిస్తానీ ఉగ్రవాదులకు అనుకూలమైన పార్టీ మద్దతుతో నడుస్తోంది. అందువల్ల పంజాబ్
వేర్పాటువాదానికి కెనడా సర్కారు మద్దతిస్తోంది. భారతదేశం ఉగ్రవాదిగా గుర్తించి,
అప్పగించమని కోరిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురైతే, ఆ నేరాన్ని భారత్
మీదకు నెట్టేసింది. స్వయానా కెనడా ప్రధానమంత్రే నిజ్జర్ హత్య భారతీయ ఏజెంట్ల పని
అని ఆ దేశపు పార్లమెంటులో ప్రకటించడం పెను సంచలనమైంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న
కెనడా భారత్ సంబంధాలు ఆ ప్రకటనతో మరింత క్షీణించాయి.
భారత్‌లో దౌత్యాధికారులను తగ్గించుకునే
విషయంలో కూడా కెనడా విదేశీ వ్యవహారాల శాఖ – గ్లోబల్ ఎఫైర్స్ కెనడా – తప్పును భారత్
మీదకే నెట్టేసే ప్రయత్నం చేసింది. భారతదేశంలోని కెనడా దౌత్యాధికారులు కొంతమందికి
వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా బెదిరింపులు వచ్చాయనీ, అందువల్ల భారత్‌లో
తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నామనీ ప్రకటించింది.
భారత్‌లోని తమ ఉద్యోగులను
ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలికంగా ఇతర ప్రదేశాలకు మారుస్తున్నామని ఆ మంత్రిత్వశాఖ
ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే ఎంతమందిని ఎక్కడికి తరలించారన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు.