ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్ దేశానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదిని వరించింది. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాలకు ఈఅవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం పోరాటం చేస్తోన్న నార్గిస్ ప్రస్తుతం ఇరాన్‌లోని ఓ జైల్లో ఉన్నారు.
సంప్రదాయాల పేరుతో మహిళల దుస్తులపై ఆంక్షలు విధించిన ఇరాన్‌పై నార్గిస్ పెద్ద పోరాటమే చేశారు. చదువుకునే రోజుల నుంచే ఆమె మహిళల హక్కుల కోసం పోరాటాలు చేశారు. కొంత కాలం పలు పత్రికలకు కాలమిస్ట్‌గా కూడా చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది నెలకొల్పిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కేంద్రంలో చేరి, అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా ఎదిగారు.
మహిళల హక్కుల కోసం నార్గిస్ ఎన్నో పోరాటాలు చేశారు. 13 సార్లు అరెస్టయ్యారు. ఐదు సార్లు జైలు శిక్ష అనుభవించారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఏడాది జైలు శిక్ష అనుభవించారు. ఆ తరవాత అనేకసార్లు అరెస్టై జైలు జీవితం గడిపారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయినా నార్గీస్ వెనకడుగు వేయలేదు. మరణశిక్షలకు వ్యతిరేకంగా కూడా ఆమె పోరాటం చేశారు.
ఇరాన్లో మహిళలపై జరుగుతోన్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా నార్గిస్ జైల్లోనే ఉద్యమం ప్రారంభించారు. ఆమె మద్దతుదారులు పెరగడంతో ఆమెపై అధికారులు అనేక ఆంక్షలు విధించారు. 2022లో హిజాబ్ ధరించనందుకు మాసా అనే కార్యకర్తను పోలీసులు అరెస్టు చేయగా, ఆమె కస్టడీలో గాయపడి, జైల్లోనే చనిపోయారు. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ సమయంలోనూ నార్గిస్ తన నిరసన ఉద్యమం కొనసాగించారు.