కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దిల్లీలో
వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సు జరుగుతోంది. ఇందులో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్‌లలో చేపట్టాల్సిన ఆపరేషన్లపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, రెసిడెన్షియల్
పాఠశాలలు, బ్యాంకులు, టెలిఫోన్ టవర్ల ఏర్పాటు పై సమాలోచనలు చేస్తున్నారు.
ప్రభుత్వ చర్యల కారణంగా ఆంధ్రపదేశ్ లో వామపక్షతీవ్రవాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశంలో తెలిపారు. మొదట్లో ఐదు జిల్లాలకు పరిమితమైన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన కట్టడి చర్యలతో వామపక్షతీవ్రవాదుల బలం 2019, 2023 మధ్య 150 నుంచి 50కి తగ్గిందన్నారు.
పొరుగు రాష్ట్రాల మధ్య పటిష్టమైన సమన్వయాన్ని నిర్ధారించడానికి, నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ముఖ్యమంత్రి జగన్…. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్థిరమైన అభివృద్ధి, సామాజిక-ఆర్థిక పురోగతే పరిష్కారమన్నారు.
ఏఓబీ ప్రాంతంలో గంజాయి పంటను ధ్వంసం చేయడంతో మావోయిస్టులకు నిధులు భారీగా నిలిచిపోయాయని, నిరంతర ప్రయత్నాలతో 2022లో గంజాయి సాగు 1,500 ఎకరాలకు తగ్గిందని, ఈ ఏడాది కేవలం 45 ఎకరాలకు పరిమితమైందని లెక్కలతో వివరించారు.
గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ పంటల మొక్కలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
అటవీ ప్రాంతాలలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.23 లక్షల ఎకరాల మేరకు ROFR పట్టాలు జారీ చేసినట్లు చెప్పారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత రాత్రి 8.30 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి అందాల్సిన నిధులపై చర్చించనున్నారు. నిన్న రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్ శాఖమంత్రి ఆర్కే సింగ్‌తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధులు త్వరగా విడుదల చేయాలని ఆర్థికమంత్రికి వినతి పత్రం అందజేసిన జగన్, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని ఆర్కే సింగ్‌ను కోరారు.