బీహార్ కులగణన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీహార్ చేపట్టిన కులగణన తదుపరి డేటా ప్రచురణ ఆపాలంటూ స్టే ఆర్డర్ కోసం పిటిషనర్లు వేసిన కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీహార్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కులగణన తదుపరి డేటాను ప్రచురించకుండా నిరోధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
బీహార్ ప్రభుత్వం కులగణన డేటాను ప్రచురించి కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడిందని, తదుపరి డేటాను ప్రచురించకుండా స్టే ఇవ్వాలంటూ పిటిషనర్ వేసిన కేసును సుప్రీంకోర్టు తిరస్కరించింది.
బీహార్ విడుదల చేసిన కులగణనలో 13.1 కోట్ల జనాభా ఉన్నట్టు తేలింది. మొత్తం జనాభాలో 63 శాతం మంది అత్యంత వెనుకబడిన కులాల తరగతుల వారు ఉన్నారు. వీరిలో 27.1 శాతం వెనుకబడిన తరగతులు, 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు. 1.7 శాతం షెడ్యూల్డ్ తెగల వారు కాగా, 15.5 శాతం జనరల్ కేటగిరీ వారు ఉన్నట్లు వెల్లడైంది. ఈ తాజా గణాంకాలను బీహార్ ప్రభుత్వం గత వారం విడుదల చేసింది.