మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం బాలీవుడ్‌కు చుట్టుకుంది. తాజాగా ఈ కేసులో ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ కోరినట్లు తెలుస్తోంది. అయితే శ్రద్ధా కపూర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మహాదేశ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. రణ్‌బీర్ కపూర్ రాయపూర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఇవాళ హాజరు కావాల్సి ఉండగా, రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్‌లో 4 వేల మందిని నియమించుకున్నారు. ఒక్కొక్కరి వద్ద 200 మంది వినియోగదారులున్నారు. రోజుకు రూ.200 కోట్ల నగదు చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. యూఏఈ ప్రధాన కేంద్రంగా ఈ ముఠా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటులు మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం నిర్వహించారు. ప్రమోటర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బు అందుకున్నట్లు ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 15 మంది సెలబ్రిటీలు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారికి కూడా త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు ఈడీ తెలిపింది. హవాలా మార్గంలో బాలీవుడ్ నటులకు చెల్లింపులు జరిగాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.