సిక్కింలో ఆకస్మిక వరద భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 19 మంది చనిపోయినట్టు గుర్తించారు. 103 మంది గల్లంతయ్యారు. గల్లంతైన 22 మంది సైనికుల్లో, ఆరుగురి మృతదేహాలు లభించాయి. 16 మంది గల్లంతైన సైనికుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 3 వేల మంది దేశ, విదేశాలకు చెందని పర్యాటకులు వరదల్లో చిక్కుపోయారు. వారిలో 2500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 6 వేల మంది ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించినట్టు సిక్కిం ప్రభుత్వం తెలిపింది.
తీస్తా వరదలు తగ్గక ముందే సిక్కిం ప్రభుత్వం మరో హెచ్చరిక జారీ చేసింది. షాకో చో సరస్సు కట్టలు తెగే ప్రమాదం ఉందని, పర్యాటలు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సమీప ప్రాంతాల్లో ఇళ్లలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
చుంగ్తుంగ్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు తీస్తా నదిలోకి వదలడంతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. గల్లంతైన సైనికుల కోసం హెలికాఫ్టర్లతో గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఆరుగురు సైనికుల మృతదేహాలను గుర్తించారు. చనిపోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన జవాన్ కూడా ఉన్నారు.
ఆకస్మిక వరదలతో సిక్కింలో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 11 పెద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. మంగన్ జిల్లాలో 8, నిమ్చిలో 2, గాంగ్టక్లో ఒక వంతెన కొట్టుకుపోయాయి. తీస్తా నది సమీపంలోని 277 ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. వరద సహాయక చర్యలను ముమ్మరం చేశారు.