సిరియా హోమ్స్ ప్రొవిన్స్‌లోనిమిలటరీ
అకాడెమీలో గ్రాడ్యుయేషన్ సెరిమొనీ జరుగుతున్న సమయంలో డ్రోన్ల దాడి జరిగింది. ఆ
దాడిలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, కనీసం 125 మంది గాయాల పాలయ్యారు. ఈ
దాడికి పాల్పడినట్లు ఏ సంస్థా ఇప్పటివరకూ ప్రకటించలేదు.
సిరియా మిలటరీ అకాడెమీలో సైనిక శిక్షణ
పూర్తిచేసుకున్న క్యాడెట్లకు గురువారం సాయంత్రం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఆ
కార్యక్రమానికి క్యాడెట్ల కుటుంబసభ్యులు, సైనికాధికారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
వేడుక ముగిసి అందరూ వెళ్ళిపోడానికి సిద్ధమవుతున్న సమయంలో డ్రోన్ల దాడి జరిగింది. ఈ
కార్యక్రమంలో పాల్గొన్న సిరియా రక్షణ శాఖ మంత్రి అక్కడినుంచి వెళ్ళిపోయిన
కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది.
డ్రోన్ దాడికి బాధ్యులు
ఎవరన్నది తెలియరాలేదు. సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న
తిరుగుబాటుదారులు, మరే ఇతర ఉగ్రవాద సంస్థలూ తామే ఈ దాడికి పాల్పడినట్లు
ప్రకటించుకోలేదు. ఆరుగురు మహిళలు, ఆరుగురు చిన్నారులు సహా వందమందికి పైగా చనిపోయిన
ఈ ఘోర సంఘటన సిరియాను కలచివేసింది. శుక్ర, శని, ఆదివారాలు సంతాపదినాలుగా ప్రభుత్వం
ప్రకటించింది.