టీడీపీ
అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్
కేసులో ఆయన రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో
పూర్తి కాగా, వర్చువల్ విధానంలో ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కోర్టు
ఆయన రిమాండ్‌ను రెండువారాలు పొడిగించింది. అంటే ఈ నెల 19 వరకు చంద్రబాబు
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జుడీషియల్ కస్టడీలోనే ఉంటారు.
మరోవైపు
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు హోరాహోరీగా సాగాయి. విచారణను రేపు మధ్యాహ్నానికి
వాయిదా వేసిన కోర్టు, రేపు కూడా ఇరువురి వాదనలు వింటామన్నారు.
సీఐడీ
తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నైపుణ్య
శిక్షణ పేరుతో చంద్రబాబు రూ. 370 కోట్లు నిధులు దారి మళ్ళించారని వాదించారు.
కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారు. ఆయన
స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారన్నారు. రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ ఖాతాలో జమ
అయ్యాయని తెలిపారు. చంద్రబాబును కస్టడీకి ఇస్తే లోతైన విచారణ జరుగుతుందని, బెయిల్
మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.
చంద్రబాబు తరఫున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే
వాదనలు వినిపించారు. సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
సీమెన్స్ తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పొరేషన్ తప్ప, ప్రభుత్వం కాదన్నారు. స్కిల్
కార్పొరేషన్, సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని, అక్కడ
అవినీతి, అక్రమాలు జరిగితే చంద్రబాబును ఎలా బాధ్యుడిని చేస్తామన్నారు.
ఫైబర్
గ్రిడ్ కేసులో ముందుస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు
విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపించగా, సీఐడీ
తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. ఈ కేసు ప్రాథమిక విచారణలో చంద్రబాబు
పేరు లేదు కాబట్టి ఆయన ప్రమేయం లేదనలేమని, పూర్తి స్థాయి విచారణ తర్వాతే చంద్రబాబు
పాత్రను గుర్తించామని కోర్టుకు తెలిపారు. టెరాసాఫ్ట్ కు పనులు ఇవ్వడం మొదలు
అన్నీ చంద్రబాబు కనుసన్నల్లో జరిగాయని
కోర్టుకు తెలిపారు.