నోబెల్ పురస్కార ప్రకటనలు కొనసాగుతున్నాయి. 2023 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఇవాళ ప్రకటించారు. నార్వే దేశానికి చెందిన జాన్ ఫోసెకు సాహిత్యంలో నోబెల్ వరించింది. ఫోసె రచించిన ఎన్నో నాటకాలు, వచన రచనలు, మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.
జాన్ ఫోసె 1959లో నార్వేలోని హేగ్సండ్ ప్రాంతంలో జన్మించారు. చిన్న వయసులో ఘోర రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. చావు అంచుల వరకు వెళ్లి బతికారు. ఈ ఘటననే ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారని చెబుతుంటారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని అందులోనే పట్టా పొందారు. జాన్ ఫోసె 1983లో రచించిన రెడ్ బ్లాక్ నవల పాఠకుల ఆదరణ పొందింది. ఆ తరవాత అనేక నాటకాలు, వచన రచనలు, కథలు, కవిత్వాలు, చిన్నారుల పుస్తకాలు రచించారు.
గద్యాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోసె, మానవ జీవన స్థితిగతులను ఎక్కువగా ప్రస్తావించేవారు. రోజువారీ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని గద్యాలు, నాటకాలు రచించి ఫోసె మంచి పేరు తెచ్చుకున్నారు.