జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్‌ను బలవంతంగా మతం
మార్చిన కేసులో ఆమె భర్త రకీబ్ ఉల్ హసన్ అలియాస్ రంజిత్ కోహ్లీకి సీబీఐ ప్రత్యేక
కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. అతని తల్లి కౌసర్ రాణికి పదేళ్ళ జైలు శిక్ష
విధించింది. ఈ కేసులో కుట్రదారుగా నిందితుడైన హైకోర్టు రిజిస్ట్రార్ ముస్తాక్
అహ్మద్‌కు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తారా సహదేవ్ బలవంతపు మతమార్పిడి కేసులో ముగ్గురు ప్రధాన నిందితులూ
నేరస్తులేనని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబర్ 30న నిర్ధారించింది.
న్యాయమూర్తి ప్రభాత్ కుమార్ శర్మ వారికి శిక్షలు ఇవాళ ప్రకటించారు.
తారా సహదేవ్ షూటింగ్లో జాతీయస్థాయిలో పేరెన్నిక
గన్న క్రీడాకారిణి. ఆమె 7 జులై 2014న రంజిత్ కోహ్లీని హిందూ వివాహ పద్ధతిలో పెళ్ళి
చేసుకుంది. వారి వివాహం జరిగిన రెండురోజుల తర్వాతే అతను ముస్లిం అనీ, అతని అసలు
పేరు రకీబ్ ఉల్ హసన్ అనీ తెలిసింది. అప్పటినుంచీ రకీబ్ ఆమెను ముస్లింగా మతం మార్చుకోవాలనీ
ఆ తర్వాత ముస్లిం సంప్రదాయ పద్ధతిలో నిఖా చేసుకుంటాననీ వేధించడం మొదలుపెట్టాడు.
అతనికి తోడు విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా పనిచేసే ముస్తాక్ అహ్మద్ కూడా తారను
వేధించడం ప్రారంభించాడు.
2014 ఆగస్ట్ 19న తారా సహదేవ్ రకీబ్ ఉల్ హసన్ మీద,
అతని తల్లిమీద హింద్పిధీ పోలీస్ స్టేషన్లో తార ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్
498ఎ, సెక్షన్ 34 ప్రకారం కేసు నమోదు చేసింది. అతను ముస్లిం అయినప్పటికీ తనకు
తప్పుడు సమాచారమిచ్చి, హిందువునని చెప్పుకుని మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడని ఆరోపించింది.
ఇస్లాంలోకి మతం మారనందుకు తనను చిత్రహింసలు పెట్టారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం
చేసింది. మతం మారాలంటూ తనను ఇబ్బంది పెట్టి బలవంతం చేసాడంటూ జార్ఖండ్ హైకోర్ట్
మాజీ విజిలెన్స్ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ మీద కూడా కేసు పెట్టింది.
జార్ఖండ్ హైకోర్టు ఈ కేసును 2015లో సీబీఐకి
అప్పగించింది. సీబీఐ ఈ కేసును ఢిల్లీలో నమోదు చేసింది. మరోవైపు తారా సహదేవ్
విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. భర్త హింసిస్తున్నాడన్న తార ఆరోపణలపై 2018 జూన్
26న రాంచీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
‘‘రకీబ్ హిందువుగా నటించి ఆమెను పెళ్ళికి
ఒఫ్పించాడు. పెళ్ళయాక ఇస్లామిక్ పద్ధతిలో నిఖా చేసుకోవాలని భావించాడు. దానికోసం
ఆమె మతం మార్చడానికి బలవంతంగా ప్రయత్నించాడు. దానికి ఆమె అంగీకరించనందున ఇంట్లో
నిర్బంధించాడు. కొన్నిరోజుల పాటు హింసించాడు. ఎట్టకేలకు పోలీసులు ఆమెను
రక్షించారు’’ అని ఆమె న్యాయవాది సీబీఐకి వెల్లడించారు.
రకీబ్ తల్లి, తారా సహదేవ్ అత్త అయిన కౌసర్ రాణిని
కూడా సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించింది. ఐపీసీ సెక్షన్ 129(B),
సెక్షన్ 298, సెక్షన్ 506, సెక్షన్ 323 కింద ఆమెను శిక్షార్హురాలిగా ప్రకటించింది.
కౌసర్ రాణి తారా సహదేవ్‌ను మతం మార్చుకోకపోతే నీ పక్కమీద భాగస్వాములు మారతారంటూ
బెదిరించింది.
జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్, ఈ కేసులో
నిందితులు నేరస్తులేనని న్యాయమూర్తి తీర్పునిచ్చాక హర్షం వ్యక్తం చేసింది.
‘‘న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది. తొమ్మిది సుదీర్ఘ సంవత్సరాల నిరీక్షణ
తర్వాత నాకు న్యాయం జరిగింది. నాకు హాని తలపెట్టినవారు నేరస్తులని నిరూపణ అయింది.
వారికి శిక్ష పడింది’’ అంటూ తార ఉద్వేగానికి లోనయింది. ఈ కేసులో సీబీఐ మొత్తం
26మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టింది. వారి క్రాస్ ఎగ్జామినేషన్ ఏడు నెలలకు
పైగా సాగింది.
రకీబ్‌ను పెళ్ళి చేసుకున్నాక తారా సహదేవ్‌ను
పాపిట్లో కుంకుమ పెట్టుకోవద్దనీ, అలా చేస్తే చేతులు విరిగిపోతాయనీ భర్త, అత్త
బెదిరించారు. ఆమెను మతం మార్చడానికి పలువురు కాజీలను ఇంటికి పిలిపించారు. మతం
మారడానికి ఒప్పుకోనందుకు తారను పలుమార్లు చితకబాదారు. తనను హింసిస్తున్న విషయాన్ని
ఎవరికైనా చెబితే తననూ, తన పుట్టింటివారిని కూడా చంపేస్తామని బెదిరించారు.
అంతేకాదు, ఆమెను కట్నం తీసుకురమ్మని కూడా వేధించారు. రకీబ్ ఆమె ఒంటిమీద సిగరెట్‌తో
కాల్చేవాడు.
నెలరోజులకు పైగా ఈ
చిత్రహింసలు అనుభవించిన తర్వాత తారా సహదేవ్ ఎలాగైనా ఆ నరకం నుంచి బైటపడాలనుకుంది. ఎలాగోలా
ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను రక్షించిన తర్వాత ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడే
ఆమె ఒంటిమీద సిగరెట్‌తో కాల్చిన మచ్చల విషయం బైటపడింది. రకీబ్, తారను శారీరకంగా
హింసించిన సంగతి ఒప్పుకున్నాడు. అయితే ఆమెను మతం మారమని బలవంతం చేసిన విషయాన్ని
మాత్రం ఒప్పుకోలేదు.