వందే
భారత్ కొత్త రైళ్ళకు నారింజ రంగు వేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని కేంద్ర
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శాస్త్రీయత ఆధారంగా రంగును ఎంపిక చేశారని
తెలిపారు.
పసుపు,
నారింజ రంగులు మనుషులకు ఎక్కువగా కనిపిస్తాయనే సైన్స్ ఆధారంగానే వందే భారత్ రైలు
రంగును నిర్ణయించినట్లు తెలిపారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, 100
శాతం శాస్త్రీయమైన ఆలోచనే ఉందన్నారు.
యూరప్ లో 80 శాతం రైళ్ళకు పసుపు, నారింజ
రంగులే వేస్తారని ఉదహరించారు. ఎన్నో రంగులు ఉన్నప్పటికీ ఈ రెండే ప్రస్ఫుటంగా
కనిపిస్తాయన్నారు.
విమానాల్లో
బ్లాక్ బాక్స్, ఓడలకు నారింజ రంగు వేయడం వెనుక ఇదే కారణం ఉందన్నారు. విపత్తు దళాల
పడవలు, జాకెట్లు కూడా ఇదే రంగులో ఉండటాన్ని ప్రస్తావించారు.
కాసరగోడ్-తిరువనంతపురం మార్గంలో వందే భారత్ రైలును ఈ నెల 24న
ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన
తొమ్మిది వందే భారత్ సర్వీసుల్లో ఇది కూడా ఒకటి. అయితే దీని రంగుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం
చేస్తున్నారు.
ప్రచార లబ్ధి కోసమే బీజేపీ తన జెండా రంగును రైలుకు వేయించిందని
విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన వైష్ణవ్, రాజకీయ కారణాలు లేనే లేవని, కేవలం
సైన్స్ మాత్రమే ఉందన్నారు.
కాసరగోఢ్
మార్గంలో ఆగస్టు 19న వందే భారత్ సర్వీసు ట్రయల్ రన్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా
మొత్తం 34 వందే భారత్ సర్వీసులు నడుస్తుండగా కాసరగోడ్-తిరువనంతపురం రైలు 31వది.