వివాదాస్పద వార్తాసంస్థ న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు
ప్రబీర్ పురకాయస్థ, చైనా సహాయంతో భారతదేశ భూభాగాలపై అసత్య ప్రచారాలకు కుట్ర
పన్నాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా
భారతదేశపు అంతర్భాగాలే అయినప్పటికీ వాటిని వివాదాస్పద భూభాగాలుగా ప్రచారం
చేయడానికి కుట్రలకు పాల్పడ్డాడని, ఆ కుట్రల్లో చైనాలోని షాంఘైకి చెందిన ఒక కంపెనీ
హస్తం ఉందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.
పటియాలా హౌస్ కోర్ట్‌లో జరిగిన వాదనల్లో ఢిల్లీ
పోలీసులు ప్రబీర్ పురకాయస్థ క్రమం తప్పకుండా నెవిల్ రాయ్ సింగంతోనూ, అతనికి చెందిన
షాంఘై కేంద్రంగా పనిచేసే స్టార్స్ట్రీమ్ కంపెనీలోని కొందరు చైనీస్ ఉద్యోగులతోనూ
ఇ-మెయిల్ సంప్రదింపులు జరుపుతుండేవారని తెలిపింది. ఆ సంప్రదింపుల్లోనే కశ్మీర్,
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారత అంతర్భాగాలు కానట్టుగా ప్రచారం చేయాలన్న తమ
ఉద్దేశాలను ప్రకటించారని వెల్లడించింది.
వారిమధ్య జరిగిన చర్చలు… కశ్మీర్, అరుణాచల్
రాష్ట్రాలను వివాదాస్పద భూభాగాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న కుట్ర
పన్నిన సంగతిని బహిర్గతం చేసాయని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలియజేసారు.
‘‘భారతదేశపు ఉత్తర సరిహద్దులను మార్చివేసేందుకు,
కశ్మీర్-అరుణాచల్ ప్రదేశ్‌లను భారత అంతర్భాగాలు కావన్నట్లుగా మ్యాప్స్‌లో
చూపేందుకు వారు చేసిన ప్రయత్నాలు, దేశ సమైక్యత, భౌగోళిక సమగ్రతలకు విఘాతం కలిగించేవిగా
ఉన్నాయి’’ అని ఢిల్లీ పోలీసులు చెప్పారు. రాజధాని సరిహద్దుల వద్ద రైతుల ఆందోళనలు
జరుగుతున్న సమయంలో విదేశీ అక్రమ నిధుల సహాయంతో ఆ ఆందోళనలను పొడిగించడానికి
సాయపడడం, నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలిగించడం, ఆస్తుల విధ్వంసం వంటి
దుష్కృత్యాలకు కూడా ఈ నిందితులు కుట్రలు పన్నారని ఢిల్లీ పోలీసులు వివరించారు.
మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసే కుట్రలు
అక్కడితో ఆగలేదని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారిని
అణచివేసేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలనుఉద్దేశపూర్వకంగా
తక్కువ చేసి చూపేందుకు తప్పుడు ప్రచారాలు చేసారని వెల్లడించారు. అంతే కాకుండా 2019
పార్లమెంటు ఎన్నికల ప్రక్రియను సైతం దెబ్బ తీసేందుకు పీపుల్స్ అలయెన్స్ ఫర్
డెమొక్రసీ అండ్ సెక్యులరిజం (పీఏడీఎస్) అనే సంస్థతో కలిసి ప్రబీర్ పురకాయస్థ కుట్ర
చేసినట్లు తెలిసిందనీ చెప్పారు.
‘‘ఈ తప్పుడు ప్రచారాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం
చేసేందుకు న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పీపుల్స్ డిస్పాచ్
అనే వెబ్ పోర్టల్ ద్వారా పెయిడ్ న్యూస్ ప్రచారం చేసారు. ఆ కుట్రలో భాగంగా విదేశాల
నుంచి అక్రమ మార్గాలలో కోట్లాది రూపాయలు వారికి అందాయి’’ అని పోలీసులు కోర్టుకు
తెలిపారు. ప్రబీర్ పురకాయస్థతో పాటు న్యూస్‌క్లిక్ మానవవనరుల విభాగం అధిపతి అమిత్
చక్రవర్తి రిమాండ్ కోరుతూ చేసిన వాదనల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి
ఈ వివరాలు వెల్లడించారు.
న్యూస్‌క్లిక్ యాజమాన్యం విదేశీ సంస్థల నుంచి
అక్రమమార్గాల్లో నిధులను సమీకరించిందనీ, ఆ నిధులతో భారతదేశపు సార్వభౌమత్వాన్నీ,
భౌగోళిక సమగ్రతనీ దెబ్బతీసే కుట్రను అమలు చేసేందుకు ప్రయత్నించిందనీ, భారతదేశం
పట్ల దేశప్రజలకు వ్యతిరేకత పెంపొందించడమే వారి ఉద్దేశమనీ, తద్వారాదేశ సమైక్యత, సమగ్రత, సురక్షలకు భంగం
వాటిల్లజేయడమే వారి లక్ష్యమనీ ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
న్యూస్‌క్లిక్ సంస్థ 2018 ఏప్రిల్ నుంచీ ఐదేళ్ళ
వ్యవధిలో అమెరికా తదితర దేశాల నుంచి కోట్ల కొద్దీ రూపాయలను అక్రమమార్గాల్లో
స్వీకరించిందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అలాంటి విదేశీ నిధులను నెవిల్ రాయ్
సింగం వివిధ కంపెనీల ద్వారా పలు అక్రమ మార్గాల్లో దేశంలోకి తీసుకొచ్చినట్టు వారు
వివరించారు.
న్యూస్‌క్లిక్ సంస్థలో షేర్‌హోల్డర్ అయిన గౌతమ్
నవ్లఖా 2018 నుంచీ భారత వ్యతిరేక, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని
కూడా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. భారత
ప్రభుత్వం నిషేధించిన నక్సల్ సంస్థలకు గౌతమ్ నవ్లఖా క్రియాశీలంగా మద్దతిచ్చాడనీ,
పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అయిన గులాం నబీ ఫయ్తో దేశవిరుద్ధ సంబంధాలు
కలిగి ఉన్నాడనీ కూడా వెల్లడించారు. అతనికి ప్రబీర్ పురకాయస్థతో 1991 నుంచీ సంబంధాలున్నాయని
వివరించారు.
అంతకుముందు, న్యాయస్థానం ప్రబీర్ పురకాయస్థ,
అమిత్ చక్రవర్తిలకు ఏడు రోజుల పోలీస్ రిమాండ్ విధించింది.