హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. వంద బృందాలుగా విడిపోయి నగరంలోని చిట్‌ఫండ్ కార్యాలయాలు, ఫైనాన్స్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆదాయపన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కూకట్‌పల్లిలోని హిందూ ఫార్ఛ్యూన్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించడంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
అమీర్‌పేటలోని పూజకృష్ణ చిట్‌ఫండ్ కార్యాలయంతోపాటు, దాని యజమాని ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో 40 మంది అధికారులు పొల్గొన్నారని తెలుస్తోంది. నగరంలోని శంషాబాద్, కూకట్‌పల్లిలోని పలు చిట్‌ఫండ్, ఫైనాన్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పలు కార్యాలయాల నుంచి ఫైల్స్, ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ల హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లిహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.