ఆకస్మిక వరదలు సిక్కింను వణికిస్తున్నాయి. బుధవారం నాటి వరదల్లో 14 మంది చనిపోయారు. 102 మంది గల్లంతయ్యారని సిక్కిం ప్రభుత్వం ప్రకటించింది. 3000 మంది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. 14 మంది కార్మికులు తీస్తా నదిపై నిర్మిస్తోన్న చుంగ్తుంగ్ డ్యామ్ వద్ద సొరంగంలో చిక్కుకుపోయారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
లోనక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం 11 గంటలకు కుండపోత వర్షం కురవడంతో తీస్తానదికి వరదలు ముంచెత్తాయని సిక్కిం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విబి పాఠక్ తెలిపారు. కుండపోత వర్షాలకు లోనక్ సరస్సు కట్టలు తెగిపోయాయి. దీంతో తీస్తానదిలో 20 మీటర్ల ఎత్తున వరదలు విరుచుకుపడ్డాయని ఆయన వెల్లడించారు. తీస్తా నదిపై నిర్మిస్తోన్న చుంగ్తంగ్ డ్యాం కూడా వరదలకు కొట్టుకుపోయిందని పాఠక్ ప్రకటించారు.
ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో చుంగ్తుంగ్ డ్యాం వద్ద సొరంగంలో 12 నుంచి 14 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 26 మంది గాయపడ్డారు. తీస్తాకు వరదలు పోటెత్తడంతో 23 మంది సైనికులు కూడా గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదని పాఠక్ చెప్పారు.
రాష్ట్రానికి మరో మూడు జాతీయ విపత్తు బృందాలను పంపాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఇప్పటికే ఒక విపత్తు బృందాన్ని పంపించారు. 3 వేల మంది దేశీయ, విదేశీ పర్యాటకులు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయారు. వారికి రక్షించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.