ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బోలెడంత అప్రతిష్ట మూటగట్టుకున్న
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. అదే కేసుకు సంబంధించి, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
లిక్కర్ స్కామ్‌కు అనుబంధంగా ఉన్న మనీ లాండరింగ్
కేసులో సంజయ్ సింగ్ ప్రమేయం ఉందన్నఆరోపణలపై ఈడీ ఈ ఉదయం ఆయన ఇంటిలో సోదాలు చేపట్టింది.
లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉండి అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేష్
అరోరా, సంజయ్ సింగ్ పేరును ఈడీ ముందు వెల్లడించారు. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ మంత్రి
మనీష్ సిసోడియాను తనకు పరిచయం చేసింది సంజయ్ సింగే అని దినేష్ ఈడీకి చెప్పారు.
ఈ కేసులో ఇప్పటికి ముగ్గురు ఆప్ నేతలు అరెస్ట్
అయ్యారు. తొలుత గతేడాది మే నెలలో ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేసారు.
నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసారన్న ఆరోపణలపై సత్యేంద్రజైన్ అరెస్ట్ అయ్యారు.
ఈ యేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడూ అయిన
మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియా అరెస్ట్ పార్టీకి, కేజ్రీవాల్‌కు
అతిపెద్ద దెబ్బ. వారిద్దరి తర్వాత, ఇవాళ ఎంపీ సంజయ్ సింగ్ కటకటాల పాలయ్యారు.
సంజయ్ సింగ్‌ను తొలుత ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకువెడతారు. అక్కడ ఆయన వాంగ్మూలం నమోదు చేస్తారు. ఎంపీని
రేపు మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. కోర్టులో ఎంపీని తమ కస్టడీకి
అప్పగించమని ఈడీ అడుగుతుంది.