రసాయన
శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించినట్లు
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.
2023
ఏడాదికిగాను రసాయనశాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేసి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ,
విశ్లేషణలు చేసినందుకు గాను మౌంగి జి బవెండి, లూయీ ఇ బ్రూస్, అలెక్సి ఐ ఎకిమోవ్‌లకు
ఈ పురస్కారం దక్కింది.
ఎల్ఈడీ టీవీ స్ర్కీన్లలోనూ, సోలార్ ప్యానల్స్ తయారీలోనూ,
వైద్యరంగంలో ట్యూమర్లు తొలగించడంలో ఈ ఆవిష్కరణలు విశేషంగా ఉపయోగపడతాయి.
డిసెంబర్
10న జరగబోయే అవార్డు ప్రదానోత్సవంలో ఈ అత్యున్నత పురస్కారం అందజేయనున్నారు.
విజేతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు నగదు కూడా అందించనున్నారు.
అంతకు ముందు
వైద్య రంగంలోనూ భౌతిక శాస్త్రంలోనూ అవార్డులను ప్రకటించిన అకాడమీ నేడు రసాయన
శాస్త్రంలో విజేతలను ప్రకటించింది. సాహిత్యం, అర్ధశాస్త్రంతో పాటు నోబెల్ శాంతి
విభాగాల్లో అవార్డులు ప్రకటించాల్సి ఉంది.
నోబెల్
అవార్డుల ప్రకటన ప్రక్రియ రహస్యంగా ఉంటుంది. పురస్కార గ్రహీతల పేర్లను
ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందే సమావేశం నిర్వహిస్తారు. అందులో ఓటింగ్
నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. అనంతరం అకాడమీ అధికారికంగా పేర్లు
ప్రకటిస్తుంది. ప్రతీ విభాగంలో నామినేషన్ల జాబితాను కూడా 50 ఏళ్ళ వరకు రహస్యంగా
ఉంచుతారు.
ఈ
ఏడాది మాత్రం ప్రకటనకు ముందే కెమిస్ట్రీ అవార్డు గ్రహీతల పేర్లు లీకవ్వడం కలకలంగా
మారింది. ఈ ప్రకటన రావడానికి కొన్ని గంటల ముందే స్వీడన్ మీడియా సంస్థలు తమ
కథనాల్లో విజేతల పేర్లు ప్రచురించాయి.
దీనిపై
నోబెల్ అవార్డు కమిటీ సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలా లీకు అయిందో
తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రెస్‌మీట్‌కు ముందే మీడియాకు సమాచారం
చేరడం తీవ్రమైన తప్పిదమన్నారు.