కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో ఇవాళ అత్యవసరంగా సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పున: పంపిణీ చేయాలని కృష్ణా ట్రిబ్యునల్‌ను కేంద్రం ఆదేశించింది. ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై రాయితీని రూ.200 నుంచి రూ.300కు పెంచారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదానికి తెరపడుతుందని ఆయన అన్నారు.
ట్రిబ్యునల్ త్వరలో ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయిస్తుందన్నారు. గతంలో ఏపీ, తెలంగాణకు 800 టీఎంసీల జలాలు కేటాయించినా గెజిట్ కాలేదని ఆయన గుర్తుచేశారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం రిట్ వేసిందని మంత్రి గుర్తుచేశారు. కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయంతో కృష్ణా నదీ జలాల వివాదానికి పరిష్కారం లభిస్తుందన్నారు.