ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌లోకి అనుమతి లేకుండా వచ్చిన వారు
తక్షణమే వెళ్లిపోవాలని, లేదంటే తరిమివేస్తామని హెచ్చరించింది. పాకిస్తాన్‌లో దాదాపు
17 లక్షల మంది ఆప్ఘన్ శరణార్థులు ఉన్నట్లు సమాచారం. వీరందర్నీ దేశం నుంచి
పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
2021లో తాలిబాన్‌లు ఆప్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్నాక పాకిస్తాన్‌కు
లక్షల సంఖ్యలో ఆప్ఘనీలు శరణార్థులుగా వచ్చారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం దాదాపు
13లక్షల మంది ఆప్ఘన్ పౌరులు శరణార్థులుగా నమోదు
చేసుకున్నారు. మరో 8.8లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ
పొందారు. వారితోపాటు మరో 17లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి
చొరబడ్డారని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్ బుగిటి ఇటీవల
పేర్కొన్నారు. వీరందరూ ఈ నవంబర్ 1 నాటికి తమ దేశం
విడిచిపోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సహాయంతో వారిని గుర్తించి, బహిష్కరిస్తామన్నారు.
నవంబర్ తర్వాత పాస్‌పోర్టు లేదా వీసా లేకుండా దేశంలోకి ఎవ్వర్నీ అనుమతించబోమని
స్పష్టం చేసారు. పాక్ పౌరులు కాకపోయినా, గుర్తింపు కార్డులు ఉన్నవారి మూలాలను
గుర్తించేందుకు డీఎన్‌ఏ టెస్టులు సైతం చేస్తామని సర్ఫరాజ్ స్పష్టం చేశారు.
తమ దేశంలో ఉన్న ఆప్ఘనీలు అందరినీ తరిమివేయాలని పాకిస్తాన్
భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా అనుమతి పొందిన వారిని కూడా
పంపించివేసేందుకు ప్రయత్నిస్తోందట. ఈ క్రమంలో ఇప్పటికే వందల మందిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌లోని అఫ్గాన్ రాయబార కార్యాలయం కూడా
పేర్కొంది.
బెలూచిస్తాన్ ప్రొవిన్స్‌లో పాకిస్తానీ తాలిబాన్లు (టీటీపీ), ఇస్లామిక్ స్టేట్ గ్రూపు మధ్య దాడులు నిత్యకృత్యమైపోయాయి. పాకిస్తాన్ అంచనాల
ప్రకారం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో 24
ఆత్మాహుతి దాడులు జరగగా, 14 దాడుల్లో ఆప్ఘనీలే ఉన్నారట. ఆప్ఘనిస్తాన్‌కు
చెందిన ఉగ్రవాద సంస్థలు తమ భూభాగంలోకి చొరబడి దాడులు చేస్తున్నాయని పాకిస్తాన్ మండిపడుతోంది.
ఆ ఆరోపణలను తాలిబాన్లు ఖండిస్తున్నారు.