జనసేన
అధినేత పవన్ కళ్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడనలో జరిగే
జనసేన సభ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ పవన్
వ్యాఖ్యానించడంపై పోలీసులు వివరణ కోరారు.
గూండాలను,
నేరస్తులను పెడన సభలోకి పంపించి, రాళ్ళ దాడితో పాటు గొడవలు సృష్టించేందుకు వైసీపీ
నేతలు ప్రయత్నిస్తున్నారని మచిలీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్
ఆరోపించారు.
అందుకు సంబంధించిన సమాచారం తనకు అందిందన్నారు. పెడన సభలో ఎలాంటి గొడవ
జరిగినా సహించబోమని, సీఎం, హోంమంత్రి,
డీజీపీని పవన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో దీనిని
చెడగొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం
ప్రయత్నిస్తోందన్నారు.
ఈ
నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ సమాచారంతో
దాడి గురించి మాట్లాడారో చెప్పాలని కోరారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమకు
అందజేయాలని కోరారు. అసాంఘిక శక్తులను తాము ఉపేక్షించబోమన్నారు.
తాము
జారీ చేసిన నోటీసులకు పవన్ నుంచి సమాధానం రాలేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా
చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బాధ్యతా రాహిత్యంగా
మాట్లాడితే దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రెచ్చగొట్టే భాష, సైగలు
మానుకోవాలని హితవు పలికారు.
పవన్
కళ్యాణ్ చేపట్టిన జనసేన వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో సాగుతోంది. అవనిగడ్డలో
ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు నియోజకవర్గాల గుండా సాగుతోంది. ఈ రోజు పెడనలో పర్యటించి
బహిరంగ సభను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు.