హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ, తాము
తయారుచేసిన తేలికపాటి యుద్ధవిమానం లైట్
కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘తేజస్’ మొదటి విమానాన్ని భారత వైమానిక దళానికి అందజేసింది.
ఇద్దరు కూర్చునే వీలున్న ఈ చిన్న ఛాపర్‌ని శిక్షణ అవసరాల కోసం వాడుకోవచ్చు, అదే
సమయంలో యుద్ధవిమానంగానూ ఉపయోగించవచ్చు.
కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్, చీఫ్ ఆఫ్
ఎయిర్ స్టాఫ్ ఎయిర్‌చీఫ్ మార్షల్ విఆర్ చౌధరి ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో
బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో తేజస్ ట్విన్ సీటర్ ఎల్‌సీఏను హెచ్ఏఎల్ సంస్థ
భారత వైమానిక దళానికి అందజేసింది.
తేజస్ అనేది తేలికైన, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా
ఎదుర్కొనగల, 4.5 జనరేషన్ విమానం. ఇందులో రిలాక్స్డ్ స్టాటిక్ స్టెబిలిటీ,
క్వాడ్రాప్లెక్స్ ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్, అడ్వాన్స్డ్ గ్లాస్ కాక్‌పిట్,
ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియానిక్ సిస్టమ్స్, ఆధునిక మిశ్రణాలతో రూపొందించిన ఎయిర్‌ఫ్రేమ్
వంటి సౌకర్యాలు కలిగిన అత్యాధునిక యుద్ధవిమానం.
తేజస్ టూ-సీటర్ విమానం ఆవిష్కరణతో, రక్షణ రంగంలో
అలాంటి సామర్థ్యం కలిగిన అతితక్కువ దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. భారత
ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇదొక గొప్ప
విజయమని హెచ్ఏఎల్ చెప్పుకొచ్చింది. భారత వైమానిక చరిత్రలో దీనికి అమిత ప్రాధాన్యం
ఉందని వివరించారు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మొత్తం 18 తేజస్ ట్విన్
సీటర్ ఎల్సీఏల కోసం ఆర్డర్ పెట్టింది, వాటిలో 8 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లోగా
అందుబాటులోకి వస్తాయి. మిగతా పదింటినీ 2026-27 నాటికి అందజేస్తామని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చెప్పింది. ఐఏఎఫ్ నుంచి మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశముందని హెచ్ఏఎల్
వివరించింది.