ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దసరా పండగ రద్దీని తట్టుకునేందుకు 5500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులతోపాటు, బెజవాడ దుర్గమ్మ దర్శనానికి తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. దసరా పండగ సెలవుల నేపథ్యంలో విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. అన్ని ప్రధాన నగరాల మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసి తెలిపింది.
అక్టోబరు 13 నుంచి 22 వరకు 2700 సర్వీసులు, 23 నుంచి 25 వరకు 2800 బస్సు సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 2050 సర్వీసులు, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153, విశాఖ నుంచి 480, రాజమండ్రి నుంచి 355, విజయవాడ నుంచి 885 సర్వీసులను నడపనున్నారు.
దసరాకు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణీకులు ఫోన్ పే, గూగుల్ పే, కోడ్ స్కాన్, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.ముందుస్తు రిజర్వేషన్లు చేసుకునే సదుపాయం ఉంది. ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటే టికెట్ ఛార్జీల్లో 10 శాతం రాయితీ అందిస్తున్నారు. ప్రత్యేక సర్వీసుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదు.
బస్సుల ట్రాకింగ్ సమాచారం కోసం 149, 08662570005 నెంబర్లకు కాల్ చేయవచ్చు. ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ లక్ష్యమంటూ ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది.