రాష్ట్రప్రభుత్వ
ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. కాగ్ వ్యక్త
పరిచిన 2021-22 నివేదికను పరిశీలిస్తే
రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందన్నారు. అప్పుల్లో ప్రథమం,
ఆస్తుల కల్పనలో అధమంగా ఉందని ఎద్దేవా చేసిన దినకర్.. ప్రభుత్వ తీరు అయోమయం
జగన్నాథంగా ఉందన్నారు.
ప్రస్తుతం
రాష్ట్రం అప్పులు సుమారు రూ. 11 లక్షల పైమాటే అన్నారు. అప్పలు తీర్చే ఆదాయం
లేకపోవడంతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రాష్ట్రంలో
ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను దీర్ఘకాలంగా
ఎందుకు పెండింగ్లో ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.
కాగ్ సవరించిన అంచనాల ప్రకారం
ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తిలో అప్పులు 40.85శాతమన్నారు. దీర్ఘకాలిక పెండింగ్
బిల్లులు, అక్రమంగా ఉద్యోగుల పీఎఫ్ వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 50
శాతం అప్పులతో మన రాష్ట్రం, దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని ఆవేదన వ్యక్తం
చేశారు.
రాబోయే
కాలంలో ఎవరు అధికారంలోకి వచ్చినా
ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితుల్లోకి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని
తీసుకెళుతోందని విమర్శించారు.
మిగతా
రాష్ట్రాల్లో మూలధన వ్యయం వాటా 14.41 శాతమైతే ఆంధ్రప్రదేశ్ లో ఆ వాటా కేవలం 9.21
శాతం మాత్రమేనని కాగ్ ఆక్షేపించిందన్నారు.
మూల ధన వ్యయం సక్రమంగా ఖర్చు చేయకపోవడంతోనే భవిష్యత్ ఆదాయం సమకూర్చే
ఆస్తులు తయారు కావడం లేదన్నారు.