ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్
నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ లిక్కర్
కేసుకు అనుబంధంగా ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు చేపట్టారు. ఈడీ
అధికారులు ఈ తెల్లవారుజామునుంచీ సోదాలు మొదలుపెట్టారు.
లిక్కర్ పాలసీ కేసులో కేంద్ర సంస్థల నిఘాకు
చిక్కిన తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్. ఇంతకుముందు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్
సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి నెలలో అరెస్ట్ చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం 2021లో లిక్కర్ పాలసీ
తీసుకొచ్చి, దాన్ని కొంతకాలం తర్వాత రద్దు చేసింది. ఆ విధానంలో అవకతవకలకు
పాల్పడ్డారన్న ఆరోపణల మీద ఎక్సైజ్ పాలసీ కేసు నమోదయింది. ఢిల్లీ సీఎం అరవింద్
కేజ్రీవాల్‌ను కూడా ఏప్రిల్ నెలలో 9 గంటల పాటు ప్రశ్నించారు. మనీష్ సిసోడియా
అరెస్టయిన కొన్నాళ్ళకే, అంటే కొన్ని నెలల క్రితమే, సంజయ్ సింగ్ తన ఇంటి దగ్గర ఈడీ
అధికారులకు స్వాగతం అంటూ ఫ్లెక్సీ బోర్డ్ పెట్టారు.
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేష్
అరోరా తనను అప్పటి ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాకు పరిచయం చేసింది సంజయ్ సింగేనని
చెప్పారు. ఈ కేసులో మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ, ఏ ఒక్కదానిలోనూ సంజయ్
సింగ్‌ను నిందితుడిగా పేర్కొనలేదు. ఛార్జిషీట్లలో ఆయన ప్రస్తావన ఉన్నప్పటికీ సంజయ్
సింగ్‌కు ఎప్పుడూ సమన్లు జారీ చేయలేదు, ఆయన ప్రకటనను రికార్డ్ చేయలేదు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి రూపకల్పన చేయడంలో లిక్కర్
కంపెనీల ప్రమేయం ఉందనీ, తద్వారా ఆయా సంస్థలు 12శాతం లాభం పొందాయనీ సీబీఐ వాదన. ఆ
12శాతంలో సగం, అంటే 6శాతం మొత్తాన్ని మధ్యవర్తుల ద్వారా ప్రజా ప్రతినిధులకు
లంచాలుగా ఇచ్చినట్టు సీబీఐ భావిస్తోంది. ‘సౌత్ గ్రూప్’గా వ్యవహరించే లిక్కర్ లాబీ ఆ
చెల్లింపులు చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ చోటు
చేసుకుందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ లిక్కర్ పాలసీని రద్దు
చేసిన తర్వాత, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తన అవినీతిని
కప్పిపుచ్చుకోడానికే పాత విధానానికి మళ్ళిందని బీజేపీ ఆరోపించింది. మనీష్ సిసోడియా
తాను కానీ, తమ పార్టీ కానీ ఎలాంటి తప్పూ చేయలేదనీ, ‘ఢిల్లీ నమూనా పరిపాలన’ను దెబ్బతీయడానికే
తనను అరెస్ట్ చేసారనీ వ్యాఖ్యానించారు.