తిరుమల
శ్రీవారి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15
నుంచి నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.
వాహనసేవలు మాత్రమే ఉంటాయి.
ఈ
నెల 14న నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. మరుసటి రోజైన 15న ఉదయం బంగారు
తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెదశేష వాహనం సేవలు నిర్వహిస్తారు.
రెండో రోజు ఉదయం
చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు. 17న అంటే మూడో
రోజు ఉదయం సింహ వాహనం నుంచి భక్తులను అనుగ్రహించి రాత్రికి ముత్యాల పందిరిపై సేద
తీరుతారు.
నాలుగో
రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి, తిరుమాడ వీధుల్లో
విహరిస్తారు.
19 తేదీ ఉదయం మోహినీ అవతారంలో భక్తులను కటాక్షిస్తారు. అదే రోజు
రాత్రి గరుడ వాహనం నుంచి భక్తులకు దర్శనమిస్తారు.
20న
ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజవాహన సేవలు ఉంటాయి. 21న
ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం సేవలు నిర్వహిస్తారు.
22 ఉదయం
స్వర్ణ రథం, రాత్రి అశ్వవాహనం సేవ నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల
చివరిరోజు అంటే 23న చక్రస్నాన ఘట్టాన్ని వేడుకగా నిర్వహిస్తారు.