అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్తీకి పదవి నుంచి ఉద్వాసన పలికారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీనిపై ఓటింగ్ జరిపి స్పీకర్ కెవిన్ మెకార్తీని పదవి నుంచి తొలగించారు. స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం
గమనార్హం. స్పీకర్ పదవి చేపట్టి, 10 నెలలు తిరగకుండానే కెవిన్ ఉద్వాసనకు గురయ్యారు.
గత ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్ ఎగువసభ సెనెట్‌లో డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ సాధించింది. ప్రజాప్రతినిధుల సభలో మాత్రం మెజారిటీ సాధించలేకపోయింది. ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 435 సీట్లకు డెమోక్రాట్లు 213, రిపబ్లికన్లు 222 సీట్లు సాధించారు. అయినా స్పీకర్ ఎన్నిక విషయంలో రిపబ్లికన్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. పార్టీలో అంతర్గత విభేదాలే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పీకర్‌గా కెవిన్ ఎన్నికయ్యారు. ఆ సమయంలో మెజార్టీ కోసం పార్టీ నేతలతో కెవిన్ ఒక ఒప్పందం చేసుకున్నారు. తనను తొలగించేందుకు ఒక్క రిపబ్లికన్ సభ్యుడు డిమాండ్ చేసినా, అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్‌కు సమ్మతిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడదే ఒప్పందం కెవిన్ పదవి పోయేలా చేసింది.
స్పీకర్‌గా కెవిన్ పదవి చేపట్టనప్పటి నుంచి డెమోక్రాట్లతో చేతులు కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అసమ్మతి పెరిగిపోయింది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వాన్ని షట్‌డౌన్ ముప్పు నుంచి బయటపడేసేందుకు కెవిన్ తీసుకున్న నిర్ణయాలు కూడా అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ క్రమంలోనే స్పీకర్ కెవిన్‌పై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మెజార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయడంతో కెవిన్ పదవీచ్యుతుడయ్యారు.