చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగం అధిపతి
అమిత్ చక్రవర్తిని ఏడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. చైనాతో సంబంధాలున్న కంపెనీల నుంచి అక్రమంగా నిధులు తరలించారనే
ఆరోపణలపై గత రెండు రోజులుగా న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, విలేకరుల ఇళ్లలో ఈడీ, ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించింది.
ఈ వ్యవహారంలో ఇప్పటికే 37 మంది పురుష, తొమ్మిది మంది మహిళా విలేకరులను ప్రశ్నించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్ట్ చేసి, ఏడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. మంగళవారం ఉదయం న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, విలేకరుల ఇళ్లలో ఈడీ, ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. విచారణలో భాగంగా విలేకరులు పరంజోయ్ గుహా ఠాకుర్తా, ఊర్మిళేష్లను కూడా అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయాలకు తరలించారు. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ (UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు.
దేశ వ్యాప్తంగా 6 నగరాల్లోని న్యూస్‌క్లిక్ కార్యాలయాలతోపాటు, దాదాపు 100 మంది విలేకరుల ఇళ్లలో, 500 మంది ఢిల్లీ పోలీసులు, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్, ముంబై నగరాల్లో ఈ సోదాలు జరిగాయి. ముందుగా సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలోని వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కేటాయించిన ఎంపీ నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఏచూరి సహాయకుడు శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తుండటంతో ఎంపీ ఇంట్లో సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్‌బాగ్ వద్ద చెలరేగిన అల్లర్లు, రైతుల ఉద్యమాలపై అదుపులోకి తీసుకున్న న్యూస్‌క్లిక్ విలేకరులను పోలీసులు ప్రశ్నించారు. ఢిల్లీలోని న్యూస్‌క్లిక్ ప్రధాన కార్యాలయాన్ని ఈడీ సీజ్ చేసింది.
న్యూస్‌క్లిక్‌కు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయనే విషయంలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. దర్యాప్తు సంస్థలు అందించిన ముందస్తు సమాచారం మేరకు సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. సోదాల్లో పలువురు విలేకరుల ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, హార్డ్ డిస్కులు, ఫ్లాష్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
గత ఆగస్ట్ 17న న్యూస్‌క్లిక్ ఎడిటర్, సిబ్బందిపై ఉగ్రవాదవ్యతిరేక నిరోధక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గడచిన మూడేళ్లలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు చేరిందని విచారణలో తేలింది. ఇందులో కొంత మొత్తం విలేకరులు గౌతమ్ నవ్లఖా, తీస్తా శీతల్వాడ్లకు చేరినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది.
విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అక్రమ మార్గాల్లో నిధులు తరలించారని న్యూస్‌క్లిక్‌పై 2021లోనే కేసు నమోదైంది. అయితే న్యూస్‌క్లిక్‌పై దాడిని ఆ పత్రిక ఎడిటర్ ఇన్ ఛీప్ ప్రబీర్ పురకాయస్థ ఖండించారు. పత్రికా, వ్యక్తి స్వేచ్ఛలను హరించి వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
న్యూస్‌క్లిక్‌పై ఈడీ దాడులను ప్రతిపక్షాలు ఖండించాయి. మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మెపుతున్నారంటూ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ, వామపక్షాల పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఎడిటర్స్ గిల్డ్, పీటీఐ ఈ దాడులను ఖండించాయి.