సిక్కిం రాష్ట్రంలో ఆకస్మిక వరదల్లో 23 మంది భారత
సైనికులు చిక్కుకున్నారు. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఆ జవాన్ల
ఆచూకీ ఇంకా తెలియలేదు.
‘‘ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు వద్ద కుండపోత వర్షం
కురిసి, లాచెన్ లోయ ప్రాంతంలోని తీస్తా నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి. ఆ వరదల్లో 23మంది
జవాన్లు చిక్కుకున్నారు. వారి ఆచూకీ తెలియలేదు’’ అని గువాహటి డిఫెన్స్ పీఆర్ఓ ఒక
ప్రకటనలో వెల్లడించారు.
ఆకస్మిక వరదల గురించి జిల్లా అధికారులు వెల్లడించారు.
‘‘తీస్తానదికి ఒక్కసారిగా వరదనీరు వెల్లువెత్తింది. గ్యాంగ్‌టక్‌కు 30 కిలోమీటర్ల
దూరంలో ఉన్న సింగ్టమ్ పట్టణం వద్ద ఇంద్రేణీ బ్రిడ్జి వరద ధాటికి కొట్టుకుపోయింది.
అక్కడికి దగ్గరలో బలూతార్ గిరిజన గ్రామాన్ని కలుపుతూ ఉండే మరో బ్రిడ్జి కూడా ఈ
తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొట్టుకుపోయింది.’’
ఋతుపవనాల వల్ల నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల్లో
భాగంగా లోనాక్ సరస్సు సమీపంలో ఈ తెల్లవారుజామున కుండపోతగా వాన పడుతూనే ఉంది.
ఫలితంగా తీస్తా నదిలోకి వరదనీరు విపరీతంగా చేరుకుంది. ఆ వరదనీటి తీవ్రతకు
బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి.
తీస్తానదిలో వరద సమాచారంతో నదికి ఎగువన ఉన్న
ప్రాంతాలవారు అప్రమత్తమయ్యారు. తీస్తా స్టేజ్ 3 డ్యామ్ ఉన్న చుంగ్తాంగ్ పట్నంలో స్థానిక
అధికారులు ప్రజలను ఖాళీ చేయించారు. ఆపైన దిక్చూ వద్దనున్న తీస్తా స్టేజ్ 5 డ్యామ్
గేట్లు ఎత్తేసారు. అయితే వరదనీటి ఉధృతికి డ్యామ్ కంట్రోల్ రూమ్ తీవ్రంగా
శిథిలమైందని మంగన్ జిల్లా అధికారులు వెల్లడించారు.
సింగ్టమ్ పట్టణంలో తీస్తా నది ఒడ్డునున్న ప్రాంతాల
వారిని అధికారులు సురక్షితంగా ఖాళీ చేయించారు. పట్నంలోని సీనియర్ సెకెండరీ పాఠశాల
భవనంలో తాత్కాలికంగా సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.