దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు
ప్రాంతాల్లో తీవ్రమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిమాలయ దేశం నేపాల్‌లో ఈ
మధ్యాహ్నం గంట వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. దాని ప్రభావం భారతదేశంలోనూ
కనిపించింది.
నేపాల్‌లో ఈ మధ్యాహ్నం 2.25 గంటలకు మొదటి భూకంపం
వచ్చింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదయింది. ఆ తర్వాత 25 నిమిషాలకు
6.2 తీవ్రతతో రెండో భూకంపం నమోదయింది. మరో 15 నిమిషాల తర్వాత 3.8 తీవ్రతతో మూడో
భూకంపం నమోదయింది. మరో 13 నిమిషాల తర్వాత, అంటే 3.19 గంటలకు 3.1 తీవ్రతతో నాలుగో
భూకంపం వచ్చింది.
భారతదేశంలోనూ ఈ భూకంపాల ప్రభావం బలంగానే
కనిపించింది. ఈ మధ్యాహ్నం 3.27 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లో 5.2 తీవ్రతతో భూకంపం
చోటు చేసుకున్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. మరికొన్ని
నిమిషాలకు 3.3 తీవ్రతతో ఉత్తరాఖండ్‌లో ప్రకంపనలు వచ్చాయని వివరించింది.
ఈ భూకంపాలన్నింటిలో బలమైన, 6.2 తీవ్రత కలిగిన
భూకంపం కేంద్రస్థానం ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌కు ఆగ్నేయదిశలో 206కిలోమీటర్ల దూరంలో
ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. దాని తర్వాత ఢిల్లీ,
చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్ సరిహద్దుల్లోని 5
జిల్లాలు సహా… ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 30 జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోను, చండీగఢ్, జైపూర్ తదితర ప్రాంతాల్లో సైతం
ప్రకంపనలు నమోదయ్యాయి.
అదృష్టవశాత్తు నేపాల్‌లో
కానీ భారతదేశంలో కానీ ఎలాంటి ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు.