బీహార్ కులగణనపై అక్టోబరు 6న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. బీహార్ ప్రభుత్వం ఇప్పటికే కుల గణన సర్వే నివేదికలను కూడా ప్రచురించిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసు అక్టోబరు 6న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు రానుంది. ఇప్పటికే బీహార్ ప్రభుత్వం కులగణన డేటాను ప్రచురించిందని ఇందులో అనేక న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ వేసింది. జన గణన అంశాలు 1948 సెన్సెస్ చట్టం ప్రకారం కేంద్రం పరిధిలోకి వస్తాయని పిటిషన్లో తెలిపింది. రాజ్యాంగానికి లోబడి ఎస్టీ,ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్లో పేర్కొంది.
కులగణన చేయాలని బీహార్ సీఎం నితిశ్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పాట్నా హైకోర్టులో వేసిన కేసును కొట్టివేయడంతో, పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం ప్రకారం జనాభా గణన కేంద్ర పరిధిలోకి వస్తుందని, ఈ విషయాన్ని బీహార్ ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్ వాదనగా ఉంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేపట్టడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనపై రాజ్యాంగం చేసిన సూచనలను ఉల్లంఘించేదిగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.
వ్యక్తుల కులం, ఉప కులం, సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకునేందుకు బీహార్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలోని 12.70 కోట్ల మంది కుల వివరాలు సేకరించి డేటాను ప్రచురించడం వివాదానికి దారి తీసింది.