స్కిల్ స్కామ్ కేసు కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో హైకోర్టుకు ఇచ్చిన పత్రాలన్నీ సోమవారంలోగా సుప్రీంకోర్టుకు సమర్పించాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం ఆదేశించింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
చంద్రబాబుపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకే సెక్షన్(17ఏ) తీసుకొచ్చారని హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 17(ఏ)వర్తిస్తుందా లేదా అనేదే కీలకంగా మారింది. క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాదని, అధికార నిర్వహణలో భాగంగా నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. యశ్వంత్ సిన్హా కేసులో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
చంద్రబాబు కేసులో 17(ఏ) వర్తించదని, 2017లోనే అవినీతి జరిగిందని, చట్ట సవరణ 2018లో జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.