మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని సమీపంలో ఓ బాలిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నివసిస్తోన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. అతని ఇంటిని బుధవారం కూల్చివేయనున్నట్టు అధికారులు ప్రకటించారు.
బాలికపై అత్యాచారం కేసులోని నిందితుడు భరత్ సోనీ జైల్లో ఉన్నాడు. కేసు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. అతని కుటుంబం కొన్నేళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాస ముంటోందని ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అతని ఇల్లు కూల్చి వేయాలని నిర్ణయించారు. భరత్ సోనీ నివసించే స్థలం ప్రభుత్వానికి కావడంతో అతనికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఉజ్జయిని కార్పొరేషన్ కమిషనర్ రోషన్ సింగ్ తెలిపారు.
బాలికపై అత్యాచార కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితుడిని పట్టుకున్నారు. దాదాపు 35 మంది పోలీసులు 700 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి, వందలాది మందిని విచారించిన తరవాత నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారి అజయ్ వర్మ తెలిపారు.
ఉజ్జయినికి 15 కి.మీ దూరంలోని బద్‌నగర్‌లో బాలికపై ఘోరం జరిగింది. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పిడినట్టు వెల్లడైంది. బాలిక రక్తమోడుతూ సహాయం కోసం ప్రతి ఇంటి తలుపు తట్టినట్టు వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. బాలిక సహాయం కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటూ చివరకు ఒక ఆశ్రమం వద్దకు చేరుకుంది. అందులోని పూజారి బాలికకు టవల్ కప్పి, వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తరవాత ఆమె అత్యాచారానికి గురైనట్టు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం బాలికను ఇండోర్‌కు తరలించారు.
‘‘నా కొడుకు నేరం చేశాడు, అతన్ని ఉరి తీయండి, అతని తరపున కోర్టులో ఎవరూ వాదించవద్దని భరత్ సోనీ తండ్రి’’ కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.