అంగళ్ల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారించిన అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సమర్థించింది.
ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అంగళ్లలో యుద్ధభేరి చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆగష్టు 4వ తేదీన చంద్రబాబు పాల్గొన్న పర్యటనలో ఉద్రిక్తతలు చెలరేగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా 179 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలు హైకోర్టు ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.
హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆరు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. టీడీపీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి, నల్లారి కిశోర్కుమార్రెడ్డిలకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు.చల్లా బాబుపై రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పిటిషన్లు వేసింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత కేసు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కేసులో సాక్షులుగా పోలీసులే ఉండటంపై కూడా ధర్మాసనం ప్రశ్నించింది. అంగళ్ల దాడుల్లో పోలీసులు కూడా గాయపడ్డారని అందుకే వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు బెయిల్ ఇచ్చినందుకు జోక్యం చేసుకోలేమని ఆరు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.