భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో అక్టోబరు పదిలోగా 40 మంది సిబ్బందిని వెనక్కు పిలిపించుకోవాలని భారత్ డెడ్లైన్ విధించింది.
రాయబార కార్యాలయాల్లో సిబ్బంది విషయంలో సమానత్వం ఉండాలని భారత్ గతంలోనే కెనడాకు సూచించింది. నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా ఖండించింది.ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయంలోని సిబ్బందితో పోల్చితే ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో సిబ్బంది అదికంగా ఉందని, దాన్ని సమాన స్థాయికి తీసుకు రావాలని విదేశాంగ శాఖ సూచించింది.
ప్రస్తుతం ఢిల్లీలోని కెనడా కార్యాలయంలో 62 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 40 మందిని వెనక్కు పిలిపించుకోవాలని భారత్ ఆదేశించింది. అక్టోబరు 10వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని కూడా డెడ్లైన్ విధించారు. డెడ్లైన్ దాటిన తరవాత అదనపు సిబ్బందికి రక్షణ తొలగిస్తామని భారత్ తెలిపింది. అయితే భారత్ తీసుకున్న తాజా నిర్ణయంపై కెనడా స్పందించాల్సి ఉంది.