Bandaru Arrest : మాజీ మంత్రి బండారు అరెస్ట్, గుంటూరు తరలింపు
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నాటకీయ పరిణామాల మధ్య వెన్నెలపాలెంలో బంగారు సత్యనారాయణమూర్తి ఇంటి గ్రిల్స్ బద్దలు కొట్టి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం నుంచే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో భారీ బలగాలను మోహరించారు. దాదాపు 24 గంటల ఉద్రిక్తతల మధ్య బండారును అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. ముందుగా ఆయనకు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు అందించారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై లైంగిక వేధింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, బెదిరింపులు, విద్వేషాలను రెచ్చిగొడ్డటం లాంటి అభియోగాలపై కేసులు నమోదు చేశారు. బండారుపై సెక్షన్ 354ఏ, 153ఏ, 504, 505, 506, 509, 499, ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ 294, 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బండారు సత్యనారాయణమూర్తిని ఇవాళ గుంటూరు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.