న్యూస్‌క్లిక్ న్యూస్ పోర్టల్‌లో పనిచేస్తోన్న విలేకరుల ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహించింది. చైనా నుంచి నిధులు అందాయనే ఆరోపణలపై ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై న్యూస్‌క్లిక్ కార్యాలయం, అందులో పనిచేస్తోన్న విలేకరుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. కొంత మంది విలేకరులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
న్యూస్‌క్లిక్ పోర్టల్‌పై గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. కొన్ని ఆస్తులను కూడా జప్తు చేసింది. తాజా దాడులపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. చైనా ప్రచారాలను ప్రోత్సహించే అమెరికా మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ ద్వారా న్యూస్‌క్లిక్‌కు నిధులు సమకూరాయని, వారితో సంబంధాలున్నాయని ఆగస్ట్‌లో న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. న్యూస్‌క్లిక్‌పై 2021లో ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి న్యూస్‌క్లిక్ ప్రమోటర్లు ముందస్తు బెయిల్ పొందారు.
పన్ను ఎగవేత కేసులో 2021లో న్యూస్‌క్లిక్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. తమపై ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని అప్పట్లో న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ విరుచుకుపడ్డారు.స్వేచ్ఛా జర్నలిజాన్ని అణచివేస్తున్నారని ఆరోపణలు చేశారు. రాజ్యాంగం 19(1)(ఎ) ప్రకరణ ప్రకారం కల్పించిన వాక్, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమంగా నిధులు చైనా నుంచి అందాయని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తగిన సమయంలో స్పందిస్తామని న్యూస్‌క్లిక్ ఎడిటర్ తెలిపారు.