తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ కుమార్తె గుడికి
వెళ్ళి దైవదర్శనం చేసుకుని పూజలు చేసారు. స్టాలిన్ కొడుకు ఉదయనిధి ‘సనాతన
ధర్మాన్ని నిర్మూలించాలి’ అని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అతని సోదరి ఆలయ సందర్శన
ప్రాధాన్యం సంతరించుకుంది.
స్టాలిన్ కుమార్తె సెందామరై ఆదివారం నాడు తమిళనాడు మయిలాదుత్తురై
జిల్లా సర్కాళిలోని సత్తాయినాథర్ ఆలయానికి వెళ్ళారు. సర్కాళి సత్తాయినాథర్ అని
పిలిచే దైవాన్ని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో
స్వాగతం పలికి దర్శనం చేయించారు. ప్రత్యేక పూజలు చేయించారు.
సత్తాయినాథర్ ఆలయం ఒక కొండ మీద ఉంటుంది. స్థానిక
స్థలపురాణం ప్రకారం శివ భగవానుడు ఆ ప్రాంతంలో మూడు దశల్లో స్తోత్రపాఠాలు
అందుకున్నాడట. ఈ మందిరంలో ఇంకా అష్టభైరవులు, తిరుజ్ఞానసంబందర్ ఆలయాలు కూడా ఉన్నాయి.సెందామరై ఆ గుడులను కూడా దర్శించుకుని అక్కడ ప్రత్యేక
పూజలు నిర్వహించారు.
సర్కాళిలోనే ధర్మపురం అధీనం మఠానికి చెందిన తిరుతంగళ్
నాయగి అంబాళ్ సహిత బ్రహ్మపురీశ్వరర్ ఆలయం కూడా ఉంది. సెందామరై ఆ మఠ ఆలయాన్ని కూడా
సందర్శించుకున్నారు.
స్టాలిన్ కుమారుడు, సెందామరై సోదరుడు ఉదయనిధి
స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మ నిర్మూలన అనే కార్యక్రమంలో పాల్గొని వివాదాస్పద
వ్యాఖ్యలు చేసారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటి వ్యాధి అనీ, దాన్ని నిర్మూలించడం
తప్ప మార్గం లేదనీ వ్యాఖ్యానించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై దేశవ్యాప్త దుమారం
చెలరేగింది.
నష్టనివారణ చర్యల్లో భాగంగా ఉదయనిధి తాను కులవివక్ష
గురించి మాత్రమే మాట్లాడాననీ, తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటాననీ సమర్థించుకునే
ప్రయత్నం చేసారు. ఈ వ్యవహారంపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఉదయనిధి
వ్యాఖ్యలపై పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది, త్వరలో విచారించనుంది.
ఉదయనిధి తల్లి, స్టాలిన్ భార్యదుర్గ హిందూ
సనాతన ధర్మాన్ని అవలంబించే భక్తురాలు. ఆమె తరచుగా ఆలయాలకు వెళ్ళి దైవదర్శనం
చేసుకుంటారు, ప్రత్యేక పూజలూ నిర్వహిస్తారు. ఇప్పుడు ఆమె కూతురు కూడా అదే బాటలో
వెడుతున్నారు. తండ్రీ కొడుకులు ప్రచ్ఛన్న క్రైస్తవులుగా హిందూధర్మం పట్ల నిరంతరం విషం
చిమ్ముతుంటే, తల్లీకూతుళ్ళు మాత్రం దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉండడం విశేషం.