దేశంలో కులగణన చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్
నిలిచింది. కుల ఆధారిత జనగణన నివేదికను బిహార్ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది.
నివేదిక ప్రకారం, బిహార్లో 36శాతం మంది ప్రజలు అత్యంత
వెనుకబడిన వర్గాలకు చెందిన వారు. 27.1శాతం మంది ప్రజలు వెనుకబడిన వర్గాల వారు.
19.7శాతం మంది షెడ్యూల్డు కులాల వారు. 1.7శాతం మంది షెడ్యూల్డు తెగలకు చెందిన
వారు. ఇతర సాధారణ జనాభా 15.5శాతం మంది ఉన్నారు. రాష్ట్ర జనాభా 13.1 కోట్లు
దాటింది.
అన్ని ఓబీసీ వర్గాల్లోనూ అతిపెద్ద వర్గం యాదవ కులం
అని ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఆయన
తండ్రి, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ ఆ కులానికి చెందిన వారే. యాదవ కులస్తులు
మొత్తం జనాభాలో 14.27శాతం మంది ఉన్నారు.
ఈ నివేదిక తర్వాత రాష్ట్రంలో ఓబీసీల కోటాను పెంచాలన్న
డిమాండ్లు తలెత్తే అవకాశముంది. ప్రస్తుతం బిహార్లో ఓబీసీ రిజర్వేషన్ల కోటా 27శాతం
ఉంది. అయితే తాజా కులగణన ప్రకారం జనాభాలో వారు 63.1శాతం ఉన్నారు. అందువల్ల తమకు
రిజర్వేషన్లను పెంచమని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట్లో ఉన్న బిహార్లో
అది పెద్ద రాజకీయ వివాదంగా రంగు పులుముకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
నివేదిక విడుదల చేసిన కాసేపటికే రాష్ట్ర ముఖ్యమంత్రి
నితీష్ కుమార్ ‘‘గాంధీ జయంతి శుభ సందర్భంలో బిహార్లో కుల గణన నివేదిక విడుదల
అయింది. ఈ పని పూర్తిచేసిన బృందానికి శుభాకాంక్షలు. ఈ అంశాన్ని చర్చించడానికి రాష్ట్ర
శాసనసభలోని తొమ్మిది పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాము. ఈ నివేదిక
ఫలితాలను వారికి వెల్లడిస్తాము’’ అని ఎక్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.
అధికార జేడీయూ ఈ నివేదికను హర్షించింది. ‘రాష్ట్రప్రభుత్వం
చరిత్ర సృష్టించింది’ అని వ్యాఖ్యానించింది.
అధికార కూటమిలోని మిత్రపక్షం ఆర్జేడీ నేత తేజస్వి
యాదవ్ ‘దశాబ్దాల ఘర్షణ’ ఫలితం ఈ నివేదిక అన్నారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ విధానాలూ,
ఉద్దేశాలూ గౌరవిస్తాయని అభిప్రాయపడ్డారు.
గాంధీ జయంతి నాడు కులగణన వివరాలను వెల్లడించడాన్ని ఆర్జేడీ
అధినేత లాలూప్రసాద్ యాదవ్ అభినందించారు. ‘‘బీజేపీ కుట్రలు, చట్టపరమైన సమస్యలను
ఎదుర్కొని బిహార్ ప్రభుత్వం కులగణన సర్వే ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది’’ అని
ప్రశంసించారు.
బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఈ
నివేదికను కేవలం కంటితుడుపు చర్య అని కొట్టిపడేసారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
సమ్రాట్ చౌధరి మాత్రం ఈ సర్వేకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. బీజేపీ-జేడీయూ
కూటమిగా ఉన్నప్పుడే ఈ ప్రయత్నం ప్రారంభమైందని గుర్తు చేసారు. ‘‘సర్వే చేసిన
విధానాన్ని, సర్వేకు అనుసరించిన పద్ధతులనూ అధ్యయనం చేసిన తరువాతనే ఈ నివేదికపై
అధికారికంగా స్పందించగలుగుతామ’’ని చెప్పారు.
బిహార్లో కుల ప్రాతిపదికన జనగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం
2022 జూన్లో నిర్ణయం తీసుకుంది. కులగణనను వ్యతిరేకిస్తూ తొలుత పట్నా హైకోర్టులో పిటిషన్
దాఖలైంది. ఈ ప్రక్రియ ఆమోదయోగ్యమే అంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని సవాల్
చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ కొనసాగుతోంది. అంతలోనే
రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేసింది.