మహాత్ముల ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పాలన కొనసాగిస్తోందని
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జాతిపిత
మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పురందరేశ్వరి,
స్వాతంత్ర్య సమరయోధులు ఆశయాలు కొనసాగించడమే వారికి అర్పించే నిజమైన నివాళి
అన్నారు.
ప్రాంతీయవాదం కారణంగా జాతీయభావనకు సవాళ్ళు ఎదురవుతున్నాయన్న
పురందరేశ్వరి, ప్రజల్లో అసహనం పెరిగి
అహింసకు దారి తీస్తోందన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మంత్రులను ఈ తరంలో
చూడగలమా అని పురందరేశ్వరి ప్రశ్నించారు. ఆయన లాగే వ్యవసాయం రంగంలో బీజేపీ
నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిందన్నారు. రైతులు తమ
పంటలు అమ్ముకునేందుకు చట్టం చేసిందని వివరించిన పురందరేశ్వరి.. లాల్ బహదూర్ శాస్త్రి ఆలోచలను ప్రధాని మోదీ
అమలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగానే
వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల సాధ్యమైందన్నారు.
వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను
తప్పుబట్టిన పురందరేశ్వరి.. రాష్ట్రంలో తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
అవుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల
అభివృద్ధి పై రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రోడ్లు సహా ఇతర మౌలిక వసతులు
కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. నాణ్యతలేని మద్యాన్ని అమ్ముతూ పాలకపార్టీ
నేతలు అక్రమంగా ఆర్జిస్తున్నారని దుయ్యబట్టారు.
మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఆదర్శనేతల ఆశయాలకు అనుగుణంగా బీజేపీ
పనిచేస్తోందని ఆ పార్టీ ముఖ్యనేత సోము వీర్రాజు అన్నారు. బ్రాందీ మీద ఆధారపడి
వైసీపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. చీఫ్ లిక్కర్ ను పాతిక రూపాయలకు తయారు చేస్తూ
అధిక రేట్లకు అమ్ముతోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో మంచి అభివృద్ధి
జరుగుతోందన్నారు.