12వ తరగతి వరకూ దేశమంతా ఒకే సిలబస్‌తో కూడిన విద్యావిధానాన్ని అమలు
చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్
సెకెండరీ ఎడ్యుకేషన్… సీబీఎస్ఈ వ్యతిరేకించింది. విద్య భారత రాజ్యాంగంలో ఉమ్మడి
జాబితాలో ఉన్న అంశం. మెజారిటీ పాఠశాలలు రాష్ట్రప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి.
కాబట్టి సిలబస్, కరిక్యులమ్ తయారు చేయడం, పాఠశాలలకు పరీక్షలు నిర్వహించడం వంటి అంశాలపై
ఆయా రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలి అని కోర్టుకు తెలిపింది.
అన్ని స్థాయుల్లోనూ మాతృభాషలో విద్యాబోధన జరగాలని సీబీఎస్ఈ సూచించింది.
స్థానిక సందర్భాలు, సంస్కృతి, భాషల్లో వైవిధ్యం కారణంగా దేశమంతా ఒకే విద్యాబోర్డ్
లేదా ఒకే సిలబస్ ఉండలేవని వెల్లడించింది.
విద్యార్థి తన చుట్టుపక్కల కనబడే జీవితాన్ని త్వరగా అర్ధం చేసుకోగలడు
కాబట్టి కరిక్యులమ్‌లో స్థానిక వనరులు, సంస్కతి, నైతిక జీవన విధానం గురించిన
వివరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. అందువల్ల మౌలికమైన ఉమ్మడి
కంటెంట్‌తో పాటు స్థానిక భాష, పరిస్థితులకు అనుగుణమైన వేర్వేరు కరిక్యులమ్లు
ఉండడమే మంచిదని సీబీఎస్ఈ అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా
ఒకే విద్యను బోధించాలంటూ సీనియర్ న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ
ప్రజాహితవ్యాజ్యం దాఖలు చేసారు. దేశంలో అన్ని ప్రవేశ పరీక్షలకు సిలబస్, కరిక్యులమ్
ఒకటిగానే ఉన్నా… సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల విద్యాబోర్డుల సిలబస్, కరిక్యులమ్
వేర్వేరుగా ఉన్నాయని ఆయన చెప్పారు. అందువల్ల భారత రాజ్యాంగంలోని 14, 15, 16
అధికరణాల స్ఫూర్తితో విద్యార్ధులకు సమాన అవకాశాలు మాత్రం రావడం లేదని వివరించారు.
ఈ తేడాను పూర్తిగా తొలగించలేకపోయినా, కాలేజీ, యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే వారికి
ప్రామాణికమైన ఎంట్రన్స్ విధానాన్ని ప్రభుత్వం కల్పించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
సిలబస్‌ను, కరిక్యులమ్‌ను ప్రామాణీకరించడం అంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి
ప్రతీఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమేనని వివరించారు.
‘‘విద్యాహక్కు
ప్రాధమిక హక్కు. కాబట్టి, విద్యార్థి సామాజిక
ఆర్థిక పరిస్థితులను బట్టి కాకుండా అందరికీ విద్య ఒకే స్థాయిలో ఒకే ప్రమాణాలతో అందుబాటులో
ఉండాలి. విద్యార్థుల సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక నేపథ్యాలు ఏవైనప్పటికీ వాటితో
సంబందం లేకుండా ఉమ్మడిగా ఒకే ప్రమాణాలతో కూడిన చదువును ఉచితంగా తప్పనిసరిగా పొందడానికి
పిల్లలందరికీ హక్కు ఉంది’’ అని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
సాధారణంగా పిల్లల పాఠ్యపుస్తకాలను తయారు
చేయడానికి కొన్ని ప్రమాణాలు పాటిస్తారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, ఎన్సీఈఆర్టీ
అభివృద్ధి చేసిన నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ పుస్తకాల రూపకల్పనకు కొన్ని విధివిధానాలను
నిర్దేశిస్తుంది. దేశంలోని అన్ని పాఠశాలలకూ కరిక్యులమ్, సిలబస్, పాఠ్యపుస్తకాలు,
ఇతర అనుబంధ పదార్ధాలను రూపొందించి అభివృద్ధి చేసే బాధ్యత ఆ రెండు సంస్థలదీ. రాష్ట్రాల
ఎస్సీఈఆర్టీలు, రాష్ట్ర విద్యా బోర్డులు ఎన్సీఈఆర్టీ నమూనా సిలబస్,
పాఠ్యపుస్తకాలను యథాతథంగా స్వీకరించవచ్చు లేదా కొద్దిపాటి మార్పులతో అనుసరించవచ్చునని
సీబీఎస్ఈ వెల్లడించింది.