ఇన్స్టంట్ మేసేజింగ్ ఫ్లాట్ఫామ్ వాట్సాప్ గత నెలలో మన దేశంలో 74.28 లక్షల ఖాతాలను నిషేధించింది. ఆగష్టు నెలలో నిషేధించిన దానికంటే ఇది 2 లక్షలు ఎక్కువే. 2021 ఐటీ చట్టం నిబంధనల మేరకు వాట్సాప్ ఈ నిషేధం విధించింది. భారత్లో వినియోగదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాక ముందే, సొంత వ్యవస్థల ద్వారా పరిశీలించి 35.06 లక్షల ఖాతాలను వాట్సాప్ నిలిపేసింది.
సెప్టెంబరు మాసంలో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ భారత్లో మొత్తం 72.28 లక్షల ఖాతాలను నిషేధించింది. ఇందులో 3.1 లక్షల ఖాతాలు ఇప్పటికే నిషేధించినవి ఉన్నాయి. వాట్సాప్ దుర్వినియోగాన్ని నిరోధించడంలో, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్నట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. భద్రతా ఫీచర్స్ పర్యవేక్షించడం, నియంత్రించేందుకు నిపుణుల బృందాలను నియమించినట్టు మెటా తెలిపింది.
వినియోగదారులు రిపోర్ట్ చేసే విధానాలను బట్టి ఖాతాలను రద్దు చేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ఫిర్యాదులను పరిశీలించి, అసభ్యతను అడ్డుకునేందుకు వాట్సాప్ తమ సొంత వేదికలను ఉపయోగిస్తున్నట్టు యాజమాన్యం పేర్కొంది. వినియోగదారుల భద్రతా నివేదికలో వచ్చిన ఫిర్యాదులు ద్వారా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. వాట్సాప్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు తమకు సొంత నివారణ మార్గాలు ఉన్నట్టు మెటా యాజమాన్యం తెలిపింది.