టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ
ప్రభుత్వం అక్రమ కేసులు మోపి అరెస్టు చేసిందంటూ ఆ పార్టీ శ్రేణులు వరుస ఆందోళన
కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పలు రూపాల్లో రాష్ట్రప్రభుత్వంపై తమ వ్యతిరేకతను
తెలుపుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలంతా సత్యమేవ జయతే
పేరుతో నిరాహార దీక్షలు చేపట్టారు.
చంద్రబాబు నాయుడు జైలులో నిరసన దీక్ష చేపట్టగా రాజమహేంద్రవరం
క్వారీ సెంటర్లో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దీక్షకు దిగారు. ఆమెకు
మద్దుతుగా పెద్దసంఖ్యలో మహిళలు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును
రాజకీయంగా దెబ్బకొట్టేందుకే జగన్ ప్రభుత్వం
అక్రమ కేసులు పెట్టిందని ఆవేదన చెందారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్,
దిల్లీ నుంచే ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. దిల్లీలో రాజ్యసభ సభ్యుడు కనకమేడల
రవీంద్రకుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కూర్చుని నిరసన తెలిపారు. లోకేశ్
తో పాటు టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, వైసీపీ ఎంపీ
రఘురామకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంగళగిరిలోని టీడీపీ
జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సహా
పలువురు ముఖ్యనేతలు సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా
వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు కొనసాగాయి. కొల్లిపరలో మాజీమంత్రి ఆలపాటి దంపతులు
నిరాహార దీక్షకు దిగగా, మూల్పూరులో మాజీమంత్రి నక్కా ఆనందబాబు, పొన్నూరులో మాజీ
ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, సత్యమేవ
జయతే దీక్షలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలిపారు.