బ్రెజిల్ టెఫ్ సరసులో ఘోరం జరిగింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో వేడి తట్టుకోలేక వందకుపైగా డాల్ఫిన్లు మృత్యువాత పడ్డాయి. బ్రెజిల్ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో 102 డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదవుతోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇంత భారీగా డాల్ఫిన్లు చనిపోవడం చాలా అసాధారణమైన విషయమని బ్రెజిలియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, మామిరావా ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద వర్షపాత ప్రాంత అరణ్యమైన అమెజాన్ ప్రాంతంలో తీవ్రమైన కరవు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. టెఫ్ సరసు నీరు వేడెక్కడంతో అక్కడి డాల్ఫిన్లను చల్లని ప్రదేశాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రెజిల్ ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాల్ఫిన్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం అంత శ్రేయస్కరం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. డాల్ఫిన్లకు వైరస్‌లు ఏమైనా ఉన్నాయా పరిశీలించాలని మామిరావా ఇనిస్టిట్యూట్‌లోని పరిశోధకుడు ఆండ్రీ కోయెల్డో కోరారు.