అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4న మరో మాజీమంత్రి లోకేశ్ తో పాటు తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
నారా లోకేశ్ కు ఇప్పటికే 41ఏ కింద నోటీసులు అందజేసిన సీఐడీ… 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది.
ఐఆర్ఆర్ కేసులో లోకేశ్ ఏ14గా ఉండగా, నారాయణ ఏ2 గా, మాజీ సీఎం చంద్రబాబు ఏ1గా ఉన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పొందిన నారాయణ, ముందస్తు బెయిల్ కోసం తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే సీఐడీ నోటీసు జారీ చసింది. లోకేశ్, నారాయణను కలిపి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసుపై లోకేశ్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయవద్దంటూ న్యాయమూర్తి ఆదేశించారు. 41 ఏ నోటీసు ఇచ్చి విచారిస్తామని ఒక వేళ విచారణలో సహకరించకపోతే న్యాయమూర్తికి తెలియజేసి అరెస్టు చేస్తామని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.
టీడీపీ హయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సీఐడీ, ఏ1 గా చంద్రబాబు పేరును ఏ2గా నారాయణ పేరును చేర్చింది. పులువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.