స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ప్రధాని లాల్
బహుదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా ఆయన సేవలను ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.
దిల్లీలోని విజయ్‌ఘాట్ కు వెళ్ళి ప్రధాని మోదీ అంజలి ఘటించారు.
లాల్ బహుదూర్
శాస్త్రి సృష్టించిన జై జవాన్, జై కిసాన్ నినాదం ఇప్పటికీ మార్మోగుతోందని ి ప్రధాని
గుర్తు చేశారు. లాల్ బహుదూర్ శాస్త్రి నిరాడంబరమైన
జీవనం, దేశం పట్ల అంకిత భావం ఇప్పటి తరాలకు స్ఫూర్తినీయమన్న ప్రధాని మోదీ, ఆయన
సృష్టించిన జై జవాన్, జై కిసాన్ నినాదం, నేటికీ ప్రతిధ్వనిస్తోందన్నారు. క్లిష్ట
సమయంలో దేశ ప్రగతి కోసం లాల్ బహుదూర్ శాస్త్రీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి
పాలకులకు ఉదాహరణగా నిలిచాయని కొనియాడారు. ఆయన దార్శనికతకు అనుగుణంగా దేశ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి
చేస్తోందన్నారు.
స్పీకర్
ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్ కూడా విజయ్‌ఘాట్ కు వెళ్ళి
నివాళులర్పించారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత,
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లాల్ బహుదూర్ శాస్త్రి సేవలను
సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. శాస్త్రీజీ నిరాడంబరమైన జీవితం అందరికీ
ఆదర్శనీయమన్నారు.
ప్రధానిగా లాల్ బహుదూర్ శాస్త్రి అందించిన సేవలు
చిరస్మరణీయమని జగన్ మోహన్ రెడ్డి ట్విట్ చేశారు. ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలు
దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అంటూ
ట్వీట్ లో పేర్కొన్నారు.
దేశ రెండో ప్రధానిగా సేవలందించిన లాల్ బహుదూర్
శాస్త్రి, 1904 లో ఉత్తర ప్రదేశ్ లో జన్మించారు. 1964 నుంచి 66 వరకు ప్రధానిగా
పనిచేశారు. 61 ఏళ్ల వయస్సులో 1966 జనవరి 11న సోవియట్ యూనియన్ లోని తాష్కెంట్ లో అనుమానాస్పద స్థితిలో తుదిశ్వాస విడిచారు. ఇండో- పాక్
యుద్ధంలో దేశాన్నినడిపించి గెలిపించిన నేత గా శాస్త్రిని భారతీయులు ఎప్పటికీ మరువలేరు.