ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జామా అనే ఉగ్రవాదిని అరెస్టు చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా అరెస్టైన షానవాజ్ ఐసిస్ పూణె మాడ్యూల్ కేసులో నిందితుడు. ఇతన్ని గతంలోనే పోలీసులు ఒకసారి అరెస్టు చేయగా, తప్పించుకుని ఢిల్లీ చేరుకున్నాడు. నిఘా వర్గాల సమాచారంతో ఎన్ఐఏ దాడి చేసి అరెస్ట్ చేసింది.
షానవాజ్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డయాపర్‌వాలా, తల్హా లియాకత్ ఖాన్‌పై ఎన్ఐఏ ఒక్కొక్కరిపై రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. పూణేలో ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై యాంటీ టెర్రర్ ఏజెన్సీ గత నెలలో పలువురిని అరెస్ట్ చేసింది.
మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న నిందితులంతా ఐసిస్ ఉగ్రవాదులని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐసిస్ ఎజెండాను కొనసాగిస్తూ దేశంలో ఇస్లామిక్ స్టేట్‌ను స్థాపించడానికి వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది.