విజయవాడ శ్రీదుర్గా మల్లేస్వారస్వామి
ఆలయ ఈవోను ప్రభుత్వం బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15
నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలో ఈవో భ్రమరాంబను ఆకస్మికంగా బదిలీ
చేశారు.
దేవాదాయశాఖకు చెందిన అధికారిని బదిలీ
చేసి ఆమె స్థానంలో రెవెన్యూశాఖ అధికారికి పోస్టింగ్ ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు
ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రెండు సార్లు ఉత్సవాలు
నిర్వహించిన అనుభవం ఉండటంతో పాటు ప్రస్తుత ఏర్పాట్లు కూడా భ్రమరాంబే
పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ఆమెను బదిలీ చేసి రెవెన్యూ శాఖ అధికారిని ఈవోగా
నియమించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి
రాంబాబుకు ఈవో భ్రమరాంబకు పొసగడం లేదు.
చైర్మన్కు స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మద్దతు ఇస్తున్నారు. ఈవోపై
సీఎంవోకు సైతం ఫిర్యాదు చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
మాత్రం భ్రమరాంబకు మద్దతు తెలుపుతున్నారు. గత నవరాత్రి ఉత్సవాల సమయంలో ఆయన
కొండపైనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
భ్రమరాంబ బదిలీ వెనుక స్థానిక ఎమ్మెల్యే
లాబీయింగ్ ఉందనే విమర్శలు వినపడుతున్నాయి.
రాష్ట్రంలో నలుగురు డిప్యూటీ
కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పెద్ది రోజాను కృష్ణా జిల్లా డీఆర్వోగా బదిలీ చేశారు.
కృష్ణా జిల్లా డీఆర్వో గా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటరమణను బాపట్లకు పంపారు.
సెప్టెంబర్ మొదటివారంలో ఎన్టీఆర్ జిల్లా
డీఆర్వోగా పోస్టింగ్ పొందిన శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టలేదు. దీంతో తాజాగా ఆయనను
దుర్గగుడి ఈవోగా నియమించారు. ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోగా నాగేశ్వరరావును
నియమించారు.