తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ విస్తృత సోదాలు చేపట్టింది. ఉగ్రవాదుల కదలికల అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులోని మక్కేవారిపేటకు చెందిన పచ్చల కిరణ్ నివాసంలో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది. మావోయిస్ట్ కార్యకలాపాలు, తదితర అంశాలపై పలువురిని విచారిస్తున్నారు. తాడేపల్లిలోని మహానాడు 13 వ రోడ్డులో బత్తుల రమణయ్య నివాసంలోను ఎన్ఐఎ సోదాలు చేపట్టింది. డోలాస్నగర్లో ఎన్ క్రాంతి కుమార్ నివాసంలో ఎన్ఐఎ సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రకాశంజిల్లాలోని పలు ప్రాంతాల్లోని అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఎ సోదాలు నిర్వహిస్తోంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంలో, ముందస్తు సమాచారంతో ఎన్ఐఎ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, చిత్తూరుల్లోనూ పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్ఐఎ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి సోదాలు మొదలయ్యాయి. పలు జిల్లాల్లోని పౌరహక్కుల నేతల ఇళ్లను తనిఖీలు చేసిన ఎన్ఐఎ వారి ఇళ్లలోనే అనుమానితులను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో 60 ప్రాతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది.