జీఎస్టీ వసూళ్లలో పురోగతి లభించింది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే 10 శాతం వసూళ్లు పెరిగాయి. సెప్టెంబర్ మాసంలో జీఎస్టీ ద్వారా రూ. 1.62 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా 60 వేలకోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
గత నెలలో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,62,712 కోట్లు. ఇందులో
సీజీఎస్టీ వాటా రూ. 29,818 కోట్లు కాగా ఎస్జీఎస్టీ రూ. 37,657 కోట్లు వసూలు అయ్యాయి. జీఎస్టీ ద్వారా అందిన మొత్తం రూ. 83,623 కోట్లు కాగా, దిగుమతులపై పన్ను ద్వారా కేంద్ర ఖజానాకు రూ. 41,145 కోట్లు జమ అయ్యాయి.
సుంకం రూపంలో రూ. 11,613 ఆదాయం రాగా అందులో దిగుమతులపై సుంకం ద్వారా వచ్చిన ఆదాయం రూ. 881 కోట్లు. గత ఏడాది సెప్టెంబర్ లో రూ. 1.47 లక్షల కోట్ల రెవెన్యూ రాగా ఈ ఏడాది 10 శాతం పెరిగింది. సెప్టెంబరులో దిగుమతులు, దేశీయ లావాదేవీల ఆదాయంలో గత ఏడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది.